Karnataka Elections: కర్ణాటక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభకానున్నది. ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అంతా సిద్ధం చేసింది.
Karnataka Elections: నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన కర్ణాటక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభకానున్నది. మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటలకు నుండి ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు వరకు సాగనున్నది. ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అంతా సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాలు అన్ని భారీ బందోబస్తు మధ్యలో ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇలాంటి రసవత్తరంగా సాగుతున్న ఈ ఎన్నికలలో 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 2,430 మంది పురుషులు, 184 మంది మహిళలు, ఒక అభ్యర్థి ట్రాన్స్‌జెండర్. వీరి భవితవ్యాన్ని తేల్చడానికి మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 2,67,28,053, మహిళలు 2,64,00,074, ఇతరులు 4,927 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో 11,71,558 మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును తొలిసారి వినియోగించుకోనున్నారు. అలాగే .. 5,71,281 మంది దివ్యాంగులు, 12,15,920 మంది 80 ఏళ్లు పైబడిన వారు కూడా తమ ఓటు హక్కు వేయనున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
224 మంది సభ్యులున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల పండుగలో సుమారు 4 లక్షల మంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, వీల్‌ఛైర్లు, విద్యుత్తు, వాలంటీర్లు, షెడ్లు, హెల్ప్ డెస్క్‌లు, పార్కింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించారు. ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
మరోవైపు.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ లు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పలు చిన్న పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఈ మూడు పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ 224 స్థానాల్లో, కాంగ్రెస్ 223, జేడీఎస్ 207 చోట్ల తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అయితే.. 1985 నుంచి ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోలేదు. ఆ ఆనవాయితీ చేరిపివేయాలని అధికార బీజేపీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. అటు కాంగ్రెస్ కూడా .. ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రచారాన్ని హోరెత్తించింది. ఇక జేడీఎస్ విషయానికి వస్తే.. రాష్ట్రంలో హంగ్ ఖాయమని,. 35-40 స్థానాలు కైవసం చేసుకుని మరోసారి ‘కింగ్‌మేకర్’ అవ్వాలని వేచిచూస్తోంది.
మరోసంచలన విషయమేమిటంటే.. కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి మంగళవారం( మే 9) వరకు రూ.379.36 కోట్ల విలువైన నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇంతా కాస్లీ ఎన్నికల్లో ఓటర్ దేవుడు అధికార పగ్గాల ను ఎవరికి అప్పగిస్తాడో మే 13 వరకు వేచి చూడాల్సిందే..
