కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే పోలింగ్ సందర్బంగా కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి.

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే పోలింగ్ సందర్బంగా కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకాలోని మసబినాల్ గ్రామంలోని ప్రజలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్) యంత్రాలను ధ్వంసం చేశారు. పోలింగ్ అధికారుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అయితే అధికారులు వీవీప్యాట్‌లు, ఈవీఎంలు మారుస్తున్నారనే పుకార్లు రావడంతో ఆగ్రహించిన పలువురు గ్రామస్థులు ఈ విధ్వంసం సృష్టించారు. 

ఇదిలా ఉంటే.. బెంగళూరులోని పద్మనాభనగర్ నియోజకవర్గంలోని పాపయ్య గార్డెన్‌లోని పోలింగ్ బూత్‌లో కొందరు యువకులు కర్రలతో తమ రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓటు వేయడానికి క్యూలో నిలబడిన కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. దీంతో వారు ఆందోళనకు దిగారు. మరోవైపు బళ్లారి జిల్లా సంజీవరాయలకోట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇక, బళ్లారి రూరల్ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ నేత ఉమేష్ యాదవ్ గాయపడ్డాడు. ఉమేష్ యాదవ్ తలకు గాయమైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. ఉమేష్ యాదవ్ గతంలో బీజేపీలో కొనసాగగా.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు.