కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌లకు చేరుకుంటున్నారు. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తిలో కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా వారు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ‘‘మొదట మనం ఓటు హక్కును వినియోగించుకుంటే.. అది మంచిది, ఇది మంచిది కాదని చెప్పవచ్చు. కానీ మనం అలా చేయకపోతే.. విమర్శించే హక్కు మనకు లేదు’’అని చెప్పారు.
‘‘నా మనవరాళ్లకు ఈ ప్రదేశం.. జీవించడానికి, వారి కెరీర్, విద్యను కొనసాగించడానికి, సమాజానికి విలువను జోడించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటిగా ఉండాలని నా ఆశ. అలా నేను ఆశిస్తున్నాను’’ అని నారాయణ మూర్తి చెప్పారు. ‘‘భారతదేశంలోని మారుమూల గ్రామంలోని పేద వ్యక్తికి ప్రాథమిక విద్య, మంచి ఆరోగ్యం, మంచి పోషకాహారం లభిస్తాయని మేము అందరం ఆశిస్తున్నాము. ఆ బిడ్డ మనవళ్లకు ఆ బిడ్డ కంటే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాము’’ అని చెప్పారు.
సుధా మూర్తి మాట్లాడుతూ.. యువతరం తమ నుంచి నేర్చుకోవాల్సి ఉందని చెప్పారు. ‘‘యువతకు నేను ఒకటి చెబుతాను.. దయచేసి మమ్మల్ని చూడండి. మాకు వయస్సు పైబడింది. అయినప్పటికీ మేము ఉదయం 6 గంటలకు లేశాం.. వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాం. దయచేసి మా నుంచి నేర్చుకోండి’’ అని సుధా మూర్తి కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పవిత్ర భాగమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లు లేకుంటే అది ప్రజాస్వామ్యం కాదన్నారు.
‘‘మీరు ఎవరికి ఓటు వేస్తారు లేదా ఎందుకు ఓటు వేస్తారు అని నేను మిమ్మల్ని అడగను.. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ వారి స్వంత అభిప్రాయం, నిర్ణయం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. మనం ప్రతి ఎన్నికల్లో ఓటు వేయాలి’’ అని సుధా మూర్తి చెప్పారు. ఓటు వేయకుండా బయట తిరిగే వ్యక్తుల గురించి ఆమె మాట్లాడుతూ.. దేశభక్తి లేని వారు అలాంటి పనులు చేస్తారని మాత్రమే తాను చెప్పగలనని అన్నారు. పొద్దున్నే లేచి మొదట ఓటు వేసి.. ఆపై మీకు కావలసిన చోటుకు వెళ్లండని సూచించారు.
