మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి బీజేపీకి షాకిచ్చారు. ఉత్తర కర్ణాటకలో 47 స్థానాల్లో పోటీ చేసిన కేఆర్‌పీపీ .. దాదాపు 25 స్థానాల్లో బీజేపీని మించి ఫలితాలను రాబట్టింది. కొన్ని చోట్ల బీజేపీ ఓట్లను చీల్చి కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చింది.
గాలి జనార్థన్ రెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మైనింగ్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదనంతర కాలంలో రాజకీయాల్లోనూ చక్కం తిప్పారు. బళ్లారి, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో ఆయన తిరుగులేని నేతగా వున్నారు. అయితే ఆతర్వాతి కాలంలో మైనింగ్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. అయినప్పటికీ సోదరులు, సన్నిహితులను మాత్రం పోటీ చేయిస్తూ వచ్చిన ఆయన రాజకీయంగా పట్టు నిలబెట్టుకున్నారు. బీజేపీకి వీర విధేయుడిగా వున్న గాలి జనార్థన్ రెడ్డిని మైనింగ్ స్కామ్‌లో ఇరుక్కోవడంతో ఆ పార్టీ పక్కనపెట్టింది. ఈ క్రమంలో ఆయన గతేడాది డిసెంబర్ 25వ తేదీన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని (కేఆర్‌పీపీ) స్ధాపించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో గంగావతి నుంచి గాలి జనార్థన్ రెడ్డి, బళ్లారి సిటీ నుంచి ఆయన సతీమణి లక్ష్మీ అరుణలు కేఆర్‌పీపీ నుంచి పోటీ చేశారు. అయితే వీరిలో ఒక్క గాలి జనార్థన్ రెడ్డి మాత్రమే విజయం సాధించారు. అంతేకాదు ఈ ఎన్నికలు గాలి కుటుంబానికి షాక్ ఇచ్చాయనే చెప్పుకోవచ్చు. గాలి సోదరులు బీజేపీ నుంచి పోటీ చేసిన సోమశేఖర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డిలు కాంగ్రెస్ అభ్యర్ధుల చేతుల్లో ఓడిపోయారు. అంతేకాదు.. గాలి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి బీ శ్రీరాములు సైతం ఓటమి పాలయ్యారు.
అయితే గాలి జనార్థన్ రెడ్డి మాత్రం బీజేపీ ఓట్లకు భారీగా గండికొట్టారు. ఉత్తర కర్ణాటకలో 47 స్థానాల్లో పోటీ చేసిన కేఆర్‌పీపీ .. దాదాపు 25 స్థానాల్లో బీజేపీని మించి ఫలితాలను రాబట్టింది. కొన్ని చోట్ల బీజేపీ ఓట్లను చీల్చి కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చింది. కొత్త పార్టీ ద్వారా తానొక్కడినే గెలిచినప్పటికీ.. తనను అవమానించిన భారతీయ జనతా పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టడంలో గాలి జనార్థన్ రెడ్డి విజయం సాధించారని విశ్లేషకులు అంటున్నారు.
