కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. 110కి పైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. 110కి పైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. అక్కడ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు. ‘‘కాంగ్రెస్ ఓటమి నుండి గుణపాఠం నేర్చుకుని నేడు విజయం వైపు పయనిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను’’ అని కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా అన్నారు.
మరోవైపు బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. ఆఫీసు వద్ద బాణసంచా కాల్చుతున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు మాత్రం ఫలితాలపై సరళిపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత.. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడికి చేరుకుంటారని సమాచారం.
అలాగే బెంగళూరులోని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పలు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యాలయాల్లో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
