కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి  తెలిసిందే. అయితే బెంగళూరు పరిధిలో జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆ నియోజకవర్గం ఫలితం శనివారం అర్దరాత్రి తేలింది.

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు పరిధిలో జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ నియోజకవర్గం ఫలితం శనివారం అర్దరాత్రి తేలింది. ఇక్కడ తొలుత కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డి విజయం సాధించగా.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రీ కౌంటింగ్ జరిపారు. అయితే చివరకు బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి 16 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సౌమ్యా రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు సీకే రామమూర్తి మద్దతుదారులు సంబరాుల చేసుకున్నారు. 

సౌమ్యా రెడ్డి ఫలితాలను వక్రీకరించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ప్రయత్నిస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆరోపించారు. జయనగర్‌లోని ఆర్‌వీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ వద్ద కౌంటింగ్‌ జరుగుతుండగా తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ డీకే శివకుమార్, సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి, ఇతర పార్టీ నేతలు బయట నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రామమూర్తికి అనుకూలంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే అన్ని మార్గాల్లో బెంగళూరు పోలీసులు, రిజర్వ్ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అసలేం జరిగిందంటే.. 
జయనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి దాదాపు 150 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అయితే అప్పటికీ ఎన్నిక సర్టిఫికేట్‌ జారీ చేయబడలేదు. సౌమ్యారెడ్డి గెలుపు ఆధిక్యం తక్కువగా ఉన్నందున.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రీకౌంటింగ్ చేయాలని బీజేపీ అభ్యర్థి రామమూర్తి కోరారు. ఈ క్రమంలో రీకౌంటింగ్ చేపట్టారు. గంటల కొద్దీ నిరీక్షణ తర్వాత బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తిని 16 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టుగా అధికారులు ప్రకటించారు. 

బీజేపీకి చెందిన రామమూర్తికి 57,797 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డికి 57781 ఓట్లు, మొత్తం మీద బీజేపీకి 16 ఓట్లు వచ్చాయి. బీజేపీకి చెందిన రామమూర్తికి 57,797 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డికి 57781 ఓట్లు వచ్చినట్టుగా ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇందుకు సంబంధించి డీకే శివకుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. 

ఇక, ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో.. కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 66 సీట్లు, జేడీ(ఎస్) 19 సీట్లు గెలుచుకున్నాయి. స్వతంత్రులు 2 చోట్ల, కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ ఒక స్థానంలో, సర్వోదయ కర్ణాటక పక్ష ఒక స్థానంలో విజయం సాధించాయి.