కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మట్లాడుతూ.. తమ పార్టీ 130కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మట్లాడుతూ.. తమ పార్టీ 130కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయమని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వంతో విసిగిపోయిన కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారనేది స్పష్టమైందని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో డబ్బుతో గెలవాలన్న బీజేపీ వ్యుహం ఫలించలేదని అన్నారు. 

ఆపరేషన్‌ కమలం‌కు కూడా బీజేపీ భారీగా డబ్బు ఖర్చు చేసేందుకు వెనకాడదని ఆరోపించారు. 2018లో డబ్బులిచ్చి నేతలను కొనుగోలు చేసిందని అన్నారు. కానీ కాంగ్రెస్‌‌కు పూర్తి మెజారిటీ వస్తుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు నమ్మకమైన మనుషులు ఉన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర తమ విజయవానికి దోహాదపడిందని అన్నారు. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపిందని చెప్పారు. కర్ణాటక ప్రజలు మత రాకీయాలకు వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చారని అన్నారు. 

ఇది ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని సిద్దరామయ్య అన్నారు. ప్రధాని కర్ణాటకకు 20 సార్లు వచ్చారని.. గతంలో ఏ ప్రధాని కూడా ఇలా ప్రచారం చేయలేదని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలకు గీటురాయి అని చెప్పారు. దేశంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించాలని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని ఆశిస్తున్నట్టుగా తెలిపారు.