కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. మే 13న కౌంటింగ్ జరగనుంది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. మే 13న కౌంటింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గానూ. 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వివరాలు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిర్ణీత గడువులోగా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలన పూర్తైన తర్వాత మొత్తం 3,100 మంది చెల్లుబాటు అయ్యే నామినేషన్లు దాఖలైనట్టుగా ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. అయితే సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నాటికి మొత్తం 517 మంది పోటీ నుండి వైదొలిగారు. దీంతో 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో 185 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఒకరు ‘‘ఇతరుల’’ వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

పార్టీల వారీగా అభ్యర్థుల విషయానికి వస్తే.. బీజేపీ నుంచి 224 మంది అభ్యర్థులు ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 223 మంది, జనతాదళ్ (సెక్యులర్) 207 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. మొత్తం 918 మంది స్వతంత్రులు, నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీల (ఆయూపీపీ) నుంచి 685 మంది పోటీలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 209 మంది, బీఎస్పీ నుంచి 133 మంది, జేడీయూ నుంచి 8 మంది, సీపీఐ(ఎం) నుంచి నలుగురు, ఎన్పీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు.

బళ్లారి సిటీ నియోజకవర్గంలో అత్యధికంగా 24 మంది అభ్యర్థులు, హోస్కోటే, అనేకల్‌లలో 23 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా 16 నియోజకవర్గాల్లో 15 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గాలలో రెండు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తామని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) మనోజ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 38 మంది మహిళలు సహా 389 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక, అత్యల్పంగా మంగళూరు, బంట్వాళ, తీర్థహళ్లి, కుందాపూర్, కాపు, యెమకనమర్డి, దేవదుర్గ్ నియోజకవర్గాల్లో ఐదుగురు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇక, గతంలో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,948 మంది అభ్యర్థులు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,655 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018లో మహిళా అభ్యర్థు సంఖ్య 219గా ఉండగా.. ఈ సారి 185కి తగ్గింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పురుష అభ్యర్థుల సంఖ్య 2,436 కాగా.. ఈసారి 2,427కి తగ్గింది.