కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కన్నడిగులు ఏ విధమైన తీర్పు ఇస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కన్నడిగులు ఏ విధమైన తీర్పు ఇస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారే విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కన్నడిగుల ఎటూవైపు చూస్తున్నారనే దానిపై ఏషియానెట్ న్యూస్- జన్ కీ బాత్ ఓపిన్ పోల్ చేపట్టింది. ఇటీవల ఏషియానెట్‌ న్యూస్- జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ రౌండ్-1ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కర్ణాటక ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతో తుది నివేదికను విడుదల చేసింది. 

అయితే ఇందులో ప్రాంతాలవారీగా గణంకాలు పరిశీలిస్తే.. పాత మైసూరులో ముక్కోణపు పోరు ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ మరింత పుజుకుందని ఏషియానెట్‌ న్యూస్- జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ సర్వే అంచనా వేసింది. గతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 23 స్థానాలు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య 26గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో జేడీఎస్ కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉండగా.. బీజేపీ కొన్ని సీట్లు లాభపడే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. 

 ఇక, బెంగళూరు రీజియన్‌కు విషయానికి వస్తే.. ఇక్కడ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఇక్కడ 32 నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరా హోరీ పోరు సాగనుందని సర్వే అంచనా వేసింది. సెంట్రల్ కర్ణాటక విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల మద్య హోరాహోరీ పోరు సాగనుంది. 

హైదరాబాద్ కర్ణాటక విషయానికి వస్తే.. ఇక్కడ కాంగ్రెస్‌కు కొద్దిగా ఎడ్జ్‌ ఉన్నట్టు అంచనా వేయబడినప్పటికీ.. కిందటి సర్వేతో పోలిస్తే కాంగ్రెస్‌కు కొంత ఆదరణ తగ్గింది. ముంబై కర్ణాటక విషయానికి వస్తే.. ఇక్కడ బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. కోస్తా కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. అయితే గతంతో పోలిస్తే.. పలు ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ పెరిగినట్టుగా సర్వే అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ కారణంగా కనిపిస్తుంది. 

ప్రాంతాల వారీగా పార్టీల సీట్ల అంచనా.. 
పాత మైసూరు (57).. బీజేపీ-14, కాంగ్రెస్-26, జేడీఎస్-17
బెంగళూరు (32).. బీజేపీ-15, కాంగ్రెస్-14, జేడీఎస్-3
సెంట్రల్ కర్ణాటక (32).. బీజేపీ-13, కాంగ్రెస్-11, జేడీఎస్-2
హైదరాబాద్ కర్ణాటక(40).. బీజేపీ-16, కాంగ్రెస్- 21, జేడీఎస్-3
ముంబై కర్ణాటక (50).. బీజేపీ-31, కాంగ్రెస్-18, జేడీఎస్ -1
కోస్తా కర్ణాటక(19).. బీజేపీ 15, కాంగ్రెస్ 4, జేడీఎస్-0

ఇక, ఈ సర్వేను ఏప్రిల్ 15 నుంచి మే 1 మధ్య నిర్వహించగా.. అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ 30 వేల మంది నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. జన్ కీ బాత్ విషయానికి వస్తే.. ఇంతకుముందు 36 సర్వేలను నిర్వహించింది. అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలలో కచ్చితమైన లేదా దాదాపు కచ్చితమైన ఫలితాలు, పోకడలను అంచనా వేసింది. ఇక, 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో జన్ కీ బాత్ ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా జన్ కీ బాత్ కచ్చితమైన అంచనాలను ఇచ్చింది. ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.