కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అయితే కన్నడనాట ప్రజల చూపు ఎటువైపు ఉందనేది.. ఏషియానెట్-సువర్ణ న్యూస్- జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ రౌండ్-1 అంచనా వేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
దక్షిణ భారతదేశంలో వున్న అత్యంత కీలకమైన రాష్ట్రం కర్ణాటకకు మే 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిన బీజేపీ అధికారంలో వున్న ఏకైక రాష్ట్రం కావడంతో కర్ణాటక ఎన్నికలపై జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికలకు ముందుకు జరుగుతున్న ఎలక్షన్స్ కావడంతో వీటిని విశ్లేషకులు సెమీఫైనల్స్‌గా అభివర్ణిస్తున్నారు. ఇదిలావుండగా కర్ణాటక ఎన్నికలపై జాతీయ స్థాయిలో అనేక సంస్థలు ఇప్పటికే సర్వేలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏషియానెట్ సువర్ణ న్యూస్- జన్ కీ బాత్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ రౌండ్-1 అంచనా ఈరోజు విడుదలైంది. దీని ప్రకారం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనుంది.
అయితే మరోసారి 2018 ఎన్నికల మాదిరే హంగ్ ఏర్పడే అవకాశం వుందని సర్వేలో తేలింది. బీజేపీకి 98 నుంచి 109, కాంగ్రెస్‌కు 89 నుంచి 97, జేడీఎస్‌కు 25 నుంచి 29 , ఇతరులకు ఒక స్థానం దక్కే అవకాశం వుందని సర్వే చెబుతోంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సాధారణ మెజారిటీ 113గా ఉంది. అయితే ఏ పార్టీ కూడా ఈ మెజారిటీ మార్క్‌ను అందుకోలేదని ఏషియానెట్-సువర్ణ న్యూస్ నిర్వహించిన జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ రౌండ్-1 అంచనా వేసింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీజేపీ కంటే కాంగ్రెస్‌కే కొద్దిగా ఓట్ల శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు దాదాపు 38-40 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేయగా.. బీజేపీకి 37-39 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు అత్యంత హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నాయని తెలిపింది. అయితే కాంగ్రెస్‌కు బీజేపీ కంటే స్వల్పంగా ఓట్ల శాతం ఎక్కువగా వస్తుందని అంచనా వేసినప్పటికీ.. గెలిచే స్థానాల పరంగా హస్తం పార్టీ గణనీయమైన ఆధిక్యతగా మారకపోవచ్చని సర్వే తెలిపింది.
ఇక జిల్లాల వారీగా వివిధ పార్టీలు గెలిచే స్థానాల విషయానికి వస్తే :
పాత మైసూర్ :
ఇక కర్ణాటకలోని ఒక్క ప్రాంతాన్ని విడివిడిగా పరిశీలిస్తే... పాత మైసూర్ ప్రాంతంలో కాంగ్రెస్, జేడీఎస్‌లు నువ్వా నేనా అని తలపడతాయని అంచనా. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ వెనుకబడిపోతుందని సర్వేలో తేలింది. ఈ ప్రాంతంలో 57 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 23, జేడీఎస్‌కు 22, బీజేపీకి 12 సీట్లు లభిస్తాయని అంచనా. తుముకూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 11 స్థానాలున్న ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 4, జేడీఎస్‌కు 2 స్థానాలు లభిస్తాయని సర్వే తెలిపింది. ఇక చిక్కబళ్లాపురా (మొత్తం 5 స్థానాలు) లో కాంగ్రెస్‌కు 3, బీజేపీకి 1, జేడీఎస్‌కు 1 స్థానం దక్కుతుందని అంచనా. కోలార్ జిల్లా (మొత్తం స్థానాలు 6)లో కాంగ్రెస్‌కు 3, జేడీఎస్‌కు 3 స్థానాలు లభిస్తాయని సర్వే చెప్పగా.. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవదని వెల్లడించింది.
రామనగర జిల్లాలో (మొత్తం స్థానాలు 4)లో కాంగ్రెస్‌కు 2, జేడీఎస్‌కు 2 స్థానాలు లభిస్తాయని సర్వే తెలిపింది. ఇక్కడ కూడా బీజేపీ ఖాతా తెరవదని అంచనా. మాండ్యా జిల్లాలో (మొత్తం స్థానాలు 7) కాంగ్రెస్ 2, జేడీఎస్ 5 స్థానాలు గెలుస్తాయని అంచనా. ఇక్కడ కూడా బీజేపీ ఖాతా తెరవదని సర్వే తెలిపింది. మైసూర్ జిల్లాలో (మొత్తం స్థానాలు 11) కాంగ్రెస్ 4, జేడీఎస్ 5, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే తెలిపింది. చామరాజనగర జిల్లాలో కాంగ్రెస్ 2, బీజేపీ 2 స్థానాలు గెలుస్తాయని.. జేడీఎస్ ఖాతా తెరవదని తెలిపింది. కొడగు జిల్లాలో (మొత్తం స్థానాలు 2).. ఇక్కడ జేడీఎస్, కాంగ్రెస్‌లు చతికిలపడతాయని.. బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే వెల్లడించింది. హసన్ జిల్లాలో (మొత్తం స్థానాలు 7) జేడీఎస్ 4, కాంగ్రెస్ 2, బీజేపీ 1 చోట విజయం సాధిస్తాయని తెలిపింది.
బెంగళూరు రీజియన్ :
రాష్ట్ర రాజధాని ప్రాంతమైన బెంగళూరులో బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడతాయని సర్వే తెలిపింది. ఇక్కడ 32 స్థానాలకు గాను బీజేపీ 15, కాంగ్రెస్ 14, జేడీఎస్ 3 చోట్ల విజయం సాధిస్తాయని సర్వే తెలిపింది. బెంగళూరు అర్భన్‌లోని 28 స్థానాలకు గాను బీజేపీ 14, కాంగ్రెస్ 13, జేడీఎస్ ఒక చోట విజయం సాధిస్తాయని వెల్లడించింది. ఇక బెంగళూరు రూరల్ విషయానికి వస్తే ఇక్కడ 4 స్థానాలకు గాను బీజేపీ, కాంగ్రెస్‌లు చెరొక చోట జేడీఎస్ రెండు స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది.
సెంట్రల్ కర్ణాటక :
26 స్థానాలున్న సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ 13 , కాంగ్రెస్ 12, జేడీఎస్ ఒక చోట గెలుస్తాయని సర్వే తెలిపింది. చిత్రదుర్గ జిల్లా (మొత్తం 6 స్థానాలు)లో బీజేపీ 2, కాంగ్రెస్ 4 చోట్ల విజయం సాధిస్తాయని తెలిపింది. దావణగెరె జిల్లా (మొత్తం స్థానాలు 8)లో బీజేపీ 4, కాంగ్రెస్ 4, చోట్ల విజయం సాధిస్తాయని సర్వే పేర్కొంది. చిక్‌మగ్‌ళూరు జిల్లాలో (మొత్తం స్థానాలు 5) బీజేపీ 3, కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధిస్తాయని తెలిపింది. ఈ మూడు జిల్లాలో జేడీఎస్ అసలు ఖాతా తెరవదని సర్వే పేర్కొంది. ఇక శివమొగ్గ జిల్లాలో (మొత్తం స్థానాలు 7) బీజేపీ 4, కాంగ్రెస్ 2, జేడీఎస్ 1 చోట గెలుస్తాయని ఓపీనియన్ పోల్ తెలిపింది.
హైదరాబాద్ కర్ణాటక :
తెలుగు వారు, మరాఠీలు, కన్నడిగుల ప్రాబల్యం మిళితమై వుండే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌దే పైచేయిగా సర్వే తెలిపింది. మొత్తం 50 స్థానాలున్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ 23, బీజేపీ 16 చోట్ల గెలిస్తే జేడీఎస్ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంటుందని ఓపీనియన్ పోల్ వెల్లడించింది. ఏడు జిల్లాలున్న ఈ ప్రాంతంలో ఆరు జిల్లాల్లో జేడీఎస్ అసలు ఖాతా తెరవదని పేర్కొంది. బీదర్ జిల్లా (మొత్తం స్థానాలు 6) బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో మూడు చోట్ల గెలుస్తాయని సర్వే చెప్పింది. గుల్బార్గా జిల్లాలో (మొత్తం స్థానాలు 9) బీజేపీ 4, కాంగ్రెస్ 5 చోట్ల విజయం సాధిస్తాయని చెప్పింది. రాయచూర్ జిల్లాలో (మొత్తం స్థానాలు 7) బీజేపీ 2, కాంగ్రెస్ 4, జేడీఎస్ ఒక చోట విజయం సాధిస్తాయని సర్వే వెల్లడించింది. యాద్గిర్ జిల్లాలో (మొత్తం స్థానాలు 4) ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఓపీనియన్ పోల్ తెలిపింది. బళ్లారి జిల్లాలో (మొత్తం స్థానాలు 5) బీజేపీ 2, కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధిస్తాయని సర్వే చెప్పింది. విజయనగర జిల్లాలో (మొత్తం స్థానాలు 4) ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు చెరో రెండు చోట్ల గెలుస్తాయని తెలిపింది. కొప్పళ జిల్లాలో (మొత్తం స్థానాలు 5) బీజేపీ 3, కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధిస్తాయని ఓపీనియన్ పోల్ అంచనా వేసింది.
ముంబై కర్ణాటక :
మరాఠాల ప్రాబల్యం అధికంగా వుండే ఈ ప్రాంతంలో బీజేపీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తుందని ఓపీనియన్ పోల్ వెల్లడించింది. ఇక్కడ 50 స్థానాలకు గాను బీజేపీ 31 , కాంగ్రెస్ 19 చోట్ల విజయం సాధిస్తాయని.. జేడీఎస్ అసలు ఏ జిల్లాలోనూ ఖాతా తెరవదని సర్వే తెలిపింది. విజయపుర జిల్లాలో (మొత్తం స్థానాలు 8) కాంగ్రెస్, బీజేపీలు చెరో రెండు చోట్ల విజయం సాధిస్తాయని వెల్లడించింది. బాగల్‌కోట్ జిల్లాలో (మొత్తం స్థానాలు 7) బీజేపీ 5, కాంగ్రెస్ 2 చోట్ల గెలుస్తాయని సర్వే తెలిపింది. బెళగావి జిల్లాలో (మొత్తం స్థానాలు 18) బీజేపీ 11, కాంగ్రెస్ 7 చోట్ల విజయం సాధిస్తాయని చెప్పింది. ధార్వాడ్ జిల్లాలో (మొత్తం స్థానాలు 7) బీజేపీ 4, కాంగ్రెస్ 3 చోట్ల గెలుస్తాయని పేర్కొంది. హావేరీ జిల్లాలో (మొత్తం స్థానాలు 6) బీజేపీ 4, కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధిస్తాయని వెల్లడించింది. గదగ్ జిల్లాలో (మొత్తం స్థానాలు 4) బీజేపీ 3, కాంగ్రెస్ ఒక చోట గెలుస్తాయని సర్వే పేర్కొంది.
కోస్టల్ కర్ణాటక :
ఈ ప్రాంతంలోనూ బీజేపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుందని ఓపీనియన్ పోల్ అంచనా వేసింది. మొత్తం 19 స్థానాలకు గాను ఇక్కడ బీజేపీకి 16, కాంగ్రెస్ 3 స్థానాలు కైవసం చేసుకుంటాయని సర్వే తెలిపింది. ఇక్కడ కూడా జేడీఎస్ ప్రభావం ఏ మాత్రం వుండదని , కనీసం ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ గెలవదని సర్వే వెల్లడించింది. ఉత్తర కర్ఱాటక (మొత్తం స్థానాలు 6) బీజేపీ 5, కాంగ్రెస్ 1 చోట గెలుస్తాయని తెలిపింది. ఉడుపి జిల్లా (మొత్తం స్థానాలు 5) ఇక్కడ బీజేపీ మొత్తం స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తుందని ఓపీనియన్ పోల్ అంచనా వేసింది. దక్షిణ కన్నడ జిల్లా (మొత్తం స్థానాలు 8)లో బీజేపీ 6, కాంగ్రెస్ 2 చోట్ల గెలుస్తాయని సర్వే పేర్కొంది.
