కర్ణాటక డీజీపీ నాలుగోసారి రాజీనామా చేశారు. మోసగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వమే తనను టార్గెట్ చేసుకున్నదని, ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహకరించడం లేదని ఆరోపిస్తూ రిజైన్ చేశారు. గతంలో ఆయన మూడు సార్లు రాజీనామా చేసి వాటిని ఉపసంహరించుకున్నారు.
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం వేధిస్తున్నదని ఆరోపిస్తూ డీజీపీ డాక్టర్ పీ రవీంద్రనాథ్ రాజీనామా చేశారు. మంగళవారం ఆయన ఐపీఎస్ సేవలకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తాను మోసగాళ్లపై లీగల్ యాక్షన్స్ తీసుకుంటే తనపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల లేకున్నా కేవలం తనను వేధించాలనే ట్రైనింగ్ వింగ్‌కు బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్‌పై ఆరోపణలు చేశారు.
ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ రూల్స్ 1995 కింద వారి రక్షణ కోసం ప్రత్యేక సెల్‌లు ఏర్పాటు చేయాలని తాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశానని తన రాజీనామా లేఖలో వివరించారు. కానీ, తన వినతిని సీఎస్ ఖాతరు చేయలేదని ఆరోపించారు. కొందరు నకిలీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లు ఇష్యూ చేస్తుంటే వారిపై తాను లీగల్ యాక్షన్స్ తీసుకున్నానని పేర్కొన్నారు. కానీ, ఈ లీగల్ యాక్షన్స్ తీసుకున్నందున తనను అవసరం లేకున్నా బదిలీ చేశారని వివరించారు.
తన బాధ్యతలను డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అదనపు డీజీపీ అరుణ్ చక్రవర్తికి అప్పగించి తాను రాజీనామా చేసినట్టు రవీంద్రనాథ్ తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర పోలీసు చీఫ్ ప్రవీణ్ సూద్‌ను కలిసిన తర్వాత రిజైన్ చేశారు.
1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ రవీంద్రనాథ్ ఇప్పటికే మూడు సార్లు రాజీనామా చేశారు. ఆ తర్వాత తన రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. 2008, 2014, 2020లలో పలు కారణాలతో రాజీనామాలు చేశారు. చివరి సారి ఆయన రాజీనామా చేశాక అప్పటి సీఎం బీఎస్ యడియూరప్పతో భేటీ అయ్యాక తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.
ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే కొంతమంది వ్యక్తులు తనను టార్గెట్ చేస్తున్నారని డీజీపీ రవీంద్రనాథ్ రాజీనామాకు ముందు ఆరోపణలు చేశారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకి కాదని, తనన ట్రాన్స్‌ఫర్ చేయడం తన విజ్ఞప్తి కాదని, అలాగనీ జనహితం కూడా కాదని వివరించారు. ఇది కచ్చితంగా కుట్రపూరితంగా చేసిన వ్యవహారమేనని, అందుకే తాను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
కర్ణాటక అసెంబ్లీ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బసవరాజు బొమ్మై ప్రభుత్వానికి నష్టంగానే విశ్లేషకులు చూస్తున్నారు.
