ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనచుట్టూ చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతూనే ఉన్నారు. ఇటీవల ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయాడు అనుకొని శవపరీక్షకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే...  సడెన్ గా ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం మహాలింగపూర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి మరీ వైద్యులు చికిత్స అందించారు.

అయితే.. ఆయన చికిత్సకు స్పందించకపోగా.. ప్రాణాలు వదిలేశాడు. దీంతో.. వెంటిలేటర్ తీసేసిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అనంతరం ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి శవపరీక్ష కోసం తరలించగా... విచిత్రం చోటుచేసుకుంది.

శవపరీక్ష చేసే టేబుల్ మీద ఆయన కదలడం మొదలుపెట్టాడు. దీంతో.. వెంటనే ఆయనను మళ్లీ ప్రభుత్వాసుపత్రి నుంచి మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించగా.. కోలుకుంటున్నట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడని తెలిసి.. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.