రాజ్యాంగాన్ని అనుసరించే నా నిర్ణయం వుంటుందన్నారు కర్ణాటక శాసనసభ స్పీకర్ రమేశ్ కుమార్. రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం ముంబై నుంచి బెంగళూరుకు చేరుకుని స్పీకర్‌ను కలిసి మరోసారి రాజీనామా లేఖలను సమర్పించారు.

ఎవర్నో రక్షించడం నా డ్యూటీ కాదని ఆయన స్పష్టం చేశారు. రాజీనామాల ఆమోదంలో ఎలాంటి జాప్యం చేయనని..  తాను ఎవరికీ అనుకూలం కాదని.. వ్యతిరేకం కాదని స్పీకర్ అన్నారు.

రాజీనామాలన్నీ సరైన ఫార్మాట్‌లోనే ఉన్నాయన్నారు. రాజీనామాల ఆమోదం విషయంలో నిబంధనలు పాటించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అయితే 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్‌ను అనుసరించలేదని.. అంతేతప్ప ఉద్దేశ్యపూర్వకంగా రాజీనామాలు ఆమోదించలేదనడం అవాస్తవమని స్పీకర్ తెలిపారు.

రాజీనామాలపై గవర్నర్ 6వ తేదీన సమాచారమిచ్చారని.. తాను కలవలేదని ఎమ్మెల్యేలన్నారు.. అయితే తాను ఎక్కడికీ పారిపోలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. అసలు జూలై 6న ఎమ్మెల్యేలెవ్వరూ తన అపాయింట్‌మెంట్ కోరలేదని వెల్లడించారు.

ఉద్దేశ్యపూర్వకంగా తనవైపు నుంచి ఎలాంటి ఆలస్యం లేదని...  కానీ తనపైపు నుంచి వస్తున్న ఆరోపణలు బాధించాయని సురేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 1952 రాజ్యాంగ సవరణ ప్రకారం పార్టీ ఫిరాయింపులు చట్టవిరుద్ధమని.. పార్టీ ఫిరాయింపులు దేశ రాజకీయాల్లో దరిద్రమని ఆయన వ్యాఖ్యానించారు.

తనకు తానుగా సంతృప్తి చెందినప్పుడే రాజీనామాలు ఆమోదిస్తానని... తన నిర్ణయం చరిత్రాత్మకం కావాలని సురేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం కూడా స్పీకర్ కార్యాలయం తెరిచే ఉండాలంటే ఎలా.. తనకు సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యేలు ముంబై వెళ్ళిపోయారని.. అలాగే తనపై ఆరోపణలు చేసి వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు.

స్పీకర్ ముందు హాజరు కావాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని సురేశ్ కుమార్ గుర్తు చేశారు. తనను కలవడానికి ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు అనుమతి అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

నాలుగు గోడల మధ్య తేల్చాల్సిన అంశాన్ని వారు దేశవ్యాప్తం చేశారని స్పీకర్ మండిపడ్డారు. ముంబై వెళ్లినా.. లేదా ఢిల్లీ వెళ్లినా నిర్ణయం తీసుకోవాల్సిందే నేనే.. ప్రజలకు వాస్తవాలు తెలియడం లేదని రమేశ్ కుమార్ తెలిపారు.