13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో కన్నడనాట రాజకీయ సంక్షోభం తలెత్తింది. సీఎం కుమారస్వామి వూళ్లోలేని సమయం చూసి ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి పరుగులు తీయడంతో కర్ణాటక రాజకీయం రంజుగా మారింది.

ఈ సంక్షోభం వెనుక కాంగ్రెస్.. బీజేపీ ఉన్నాయంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. జేడీఎస్‌ను వదిలించుకోవాలనే కాంగ్రెస్సే తన మార్క్ రాజకీయాలకు తెరతీసిందనే పుకార్లు వినిపిస్తున్నాయి.

దీనికి తోడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితే రాజీనామాలు వెనక్కి తీసుకుంటామని పలువురు ఎమ్మెల్యేలు చెప్పడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఏది ఏమైనప్పటికీ ఈసారి ముఖ్యమంత్రి మార్పు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సీఎం రేసులో సిద్ధు, సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించే సత్తా వున్న డీకే శివకుమార్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. కన్నడ నాట సీనియర్ నేతగా.. అనేక సంక్షోభాల నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని విజయవంతంగా బయటపడేసిన నేతగా డీకేకు పేరుంది.

శాసనసభలో బల నిరూపణ సమయంలోనూ... ఏడాదిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరును.. తాజాగా ఎమ్మెల్యేల రాజీనామా పత్రాలను స్పీకర్ ఛాంబర్‌లోనే ఆయన ధైర్యంగా చించేశారు.

2017లో నాటి గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో.. బీజేపీ ఎత్తులకు, పై ఎత్తులు వేసి కాంగ్రెస్ అభ్యర్ధిని ఆయన గెలిపించారు. గ్రామస్థాయి నుంచి పట్టున్న నేతగా డీకే పేరును నెటిజన్లు సూచిస్తున్నారు. క్లిష్ట సమయాల్లో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా అందరికీ గుర్తొచ్చే ఆయనే సీఎం స్ధానానికి సరైన అభ్యర్ధి అని నెటిజన్లు బాహాటంగానే చెబుతున్నారు.

‘‘ఆయన కాకపోతే ఇంకెవరు..? ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడు అంటూ  వారు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారనేది తెలియకపోయినా... డీకే పేరు మాత్రం జనం నోళ్లలో నానుతోంది.

మరోవైపు కర్ణాటక సంక్షోభంపై ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర నివాసంలో సీనియర్ నేతలు, మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. సంక్షోభం నుంచి విజయవంతంగా బయటపడతామని శివకుమార్ స్పష్టం చేశారు.