బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కాంగ్రెసు నేత డికె శివకుమార్ ఆహోరాత్రులు పనిచేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన శనివారం ఉదయమే తమ పార్టీ ఎమ్మెల్యే ఎంటిబీ నాగరాజ్ ఇంటికి వెళ్లారు. 

రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరడానికి శివకుమార్ నాగరాజు నివాసానికి వెళ్లారు. నాగరాజ్ జులై 10వ తేదీన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు చిక్ బళ్లాపూర్ కాంగ్రెసు ఎమ్మెల్యే డాక్టర్ కె. సుధాకర్ కూడా అదే రోజు రాజీనామా సమర్పించారు. 

రాత్రికి రాత్రి ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించలేమని స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నాగరాజ్, సుధాకర్ రాజీనామాలు చేశారని, వారి రాజీనామాలను తాను ఆమోదించలేదని, రాత్రి రాత్రి వాటిపై నిర్ణయం తీసుకోలేనని ఆయన చెప్పారు.  ఈ నెల 17వ తేదీ వరకు తాను వారికి సమయం ఇచ్చానని, నిబంధనల మేరకు తాను వ్యవహరిస్తానని ఆయన చెప్పారు.