కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వం పడిపోకుండా ఒక్కో ఎమ్మెల్యేను దారికి తెచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్‌లు చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ మొదటికి వస్తున్నాయి.

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ చేసిన మంత్రాంగంతో రాజీనామాపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. మరో ఎమ్మెల్యే సుధాకర్‌‌ను ఒప్పిస్తానంటూ బాధ్యత తీసుకున్న నాగరాజు.. ముంబైలో రెబల్ ఎమ్మెల్యేల శిబిరంలో కలసి పోవడంతో కన్నడ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

సీఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధపడిన వేళ.. ప్రభుత్వం నిలబడాలంటే ఒక ఎమ్మెల్యే మద్ధతు తప్పనిసరి.. ఈ నేపథ్యంలో కుమారస్వామి, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ దాదాపు 15 గంటల పాటు శ్రమించి నాగరాజును ఒప్పించారు.

వారి ప్రతిపాదనకు ఒప్పకున్నట్లే.. ఒప్పుకుని ప్లేట్ ఫిరాయించడంతో కుమారస్వామి ప్రభుత్వానికి ముప్పు పొంచి వుంది. మరోవైపు శుక్రవారం బలపరీక్షకు వెళ్లాలని కుమారస్వామి భావిస్తుంటే.. అప్పటి వరకు అవకాశం ఇవ్వకుండా సోమవారమే విశ్వాసాన్ని నిరూపించుకోవాలని యడ్యూరప్ప డిమాండ్ చేస్తున్నారు.