కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ శాసనసభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడతో మంత్రి డీకే శివకుమార్ భేటీ అయ్యారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులపై వారిద్దరూ భేటీ అయ్యారు. సాయంత్రం ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా నుంచి బెంగళూరు తిరిగిరానున్నారు. కాగా.. ఈ సంక్షోభంపై మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరో సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ... ఏదైనా జరిగితే ప్రజాస్వామ్య బద్ధంగా.. సున్నితంగా జరగాలని...సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో పీసీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు రాజీనామాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.