కర్ణాటక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో స్పీకర్ రమేశ్ కుమార్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠకు ఆయన తెరదించారు. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాపై తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోనని ఆయన స్పష్టం చేశారు.

వారంతా తనను వ్యక్తిగతంగా కలిసి రాజీనామాలపై వివరణ ఇస్తేనే చర్యలు ఉంటాయని రమేశ్ కుమార్ తేల్చి చెప్పారు. తనకు ఎవరిపైనా వివక్ష లేదని... తాజా రాజకీయ పరిస్ధితులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

చట్టం, రాజ్యాంగానికి అనుగుణంగానే తాను పనిచేస్తానని.. ఎవ్వరు నాకు బంధువులు కాదని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. స్పీకర్ ఛాంబర్‌లోకి రాగానే.. తాను కాంగ్రెస్ వ్యక్తినన్న సంగతి మరచిపోతానని నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని తెలిపారు.

రాష్ట్ర ప్రజలు, తన తండ్రి తప్ప ఇంకెవరు తనపై ఒత్తిడి తీసుకురాలేనన్నారు. తాను ఇకపై స్పీకర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని.. ఎమ్మెల్యేలు కలిసి రాజీనామాలపై వివరణ ఇస్తే అందుకు తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ తెలిపారు.

మరోవైపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి అసమ్మతి నేత రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి హాజరవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత ఈమె కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ.... నిన్న రాత్రి సోనియా గాంధీతో భేటీ అయిన సౌమ్య... మంగళవారం సీఎల్పీ సమావేశంలో కనిపించారు.

మరో నేత ఎంటీబీ నటరాజన్ సీఎల్పీ సమావేశానికి హాజరుకాకపోడంతో ఆయనపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అనారోగ్యం కారణంగా తాను కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరుకాలేకపోయానని నటరాజన్ తెలపడంతో అగ్రనేతలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవాళ్టీ పరిణామాలతో కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్లు తెలుస్తోంది. అయితే గోవాలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నేతలు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.