కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజుకొక మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్-కాంగ్రెస్.. అధికారాన్ని దక్కించుకునేందుకు అటు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

ఈ క్రమంలో అసంతృప్త నేతలకు పదవులు ఇచ్చేందుకు వీలుగా 21 మంది కాంగ్రెస్, 9మంది జేడీఎస్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసీ బీజేపీకి మద్ధతు ప్రకటించారు.

ఈ క్రమంలో మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ శానససభాపక్షం సమావేశం కానుంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై భేటీలో చర్చించనున్నారు. కానీ ఈ సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.. అయితే ఎమ్మెల్యేలు రాకపోతే వేటు వేస్తామని కాంగ్రెస్ ముందే ప్రకటించింది.

రాజీనామాలపై స్పీకర్ తీసుకోనున్న నిర్ణయం కీలకంగా మారనుంది. సంక్షోభం నుంచి కార్యాలయానికి రాని... శాసనసభాపతి రమేశ్ మంగళవారం అందుబాటులోకి రానున్నారు. కాంగ్రెస్, జేడీఎస్, రెబల్ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాలను ఆయన పరిశీలించే అవకాశం ఉంది.

వ్యక్తిగతంగా ఒక్కొక్క ఎమ్మెల్యేను పిలిచి ఆయన వివరణ కోరనున్నారు. అయితే స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో రెబల్ ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం లేదు.

మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు తమ మకాంను ముంబై నుంచి గోవాకు మార్చారు. వీరిలో 10 మంది కాంగ్రెస్, ఇద్దరు జేడీఎస్, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ యువమోర్చా విభాగానికి చెందిన కీలక నేత రెబల్ ఎమ్మెల్యే వెంట ఉన్నట్లుగా తెలుస్తోంది.

వీరు బెంగళూరుకు చేరుకుని స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలుస్తారా అన్నది అనుమానామే. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఒక్క ఎమ్మెల్యే అటు ఇటైనా ఫలితం తేడా కొట్టే ప్రమాదం ఉండటంతో అటు జేడీఎస్ సైతం తమ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ప్రేస్టేజ్‌ గోల్డ్‌షైర్ రిసార్టుకు తరలించింది. కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల రాజీనామాల అనంతరం కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 211కు చేరింది.

దీని ప్రకారం ప్రభుత్వానికి ఉండాల్సిన మేజిక్ ఫిగర్ 106.. ఒకవేళ స్పీకర్ రాజీనామాలను పరిగణనలోనికి తీసుకుంటే కాంగ్రెస్‌కు 68, జేడీఎస్‌కు 34 మంది సభ్యులు మాత్రమే ఉంటారు.

ఇదే సమయంలో బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉండగా.. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు సైతం తమ మద్ధతును బీజేపీకి ప్రకటించారు. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  వీటిలో ఏం జరగాలన్నా రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి.