బెంగళూరు: ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం సంక్షోభం దిశగా పయనిస్తోంది. కుమారస్వామి కుర్చీకి ఎసరు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జెడిఎస్, కాంగ్రెసు సంకీర్ణ ప్రభుత్వం పతనదిశగా సాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు రాజీనామాలు చేసే దిశగా సాగుతున్నారు. 

కొద్దిరోజుల క్రితం ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయగా శనివారంనాడు మరో 12 మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు తయారయ్యారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. వీరిలో 9 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు కాగా, ముగ్గురు జెడిఎస్ సభ్యులు. అయితే, శివకుమార్ జోక్యంతో నలుగురు వెనక్కి తగ్గారు. 

"

 

కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బీసీ పాటిల్‌, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్‌, శివరామ, రామలింగా రెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్‌, రమేశ్‌ జక్కహళ్లిల రాజీనామాలు చేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో కర్ణాటక ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడనుంది. కాంగ్రెసు, జెడిఎస్ సభ్యులు రాజీనామా పత్రాలు అందించడానికి స్పీకర్ వద్దకు వెళ్లారు. అయితే, ఆయన అందుబాటులో లేరు. దీంతో వారు శనివారం సాయంత్రం గవర్నర్ ను కలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక వ్యవహారాల ఇంఛార్జ్‌ కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్రానికి పంపనుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదివారం రాత్రి బెంగళూరు చేరుకోనున్నారు. 

కర్ణాటక శాసనసభలో మొత్తం 224 స్థానాలు ఉండగా బీజేపీకి 105, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37, బీఎస్పీకి 1 స్థానాలు ఉన్నాయి. ఇతరులు ఇద్దరు ఉన్నారు. 

ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సంకీర్ణ ప్రభుత్వ బలం మరింత పడిపోతుంది. సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ క్రమంగా తగ్గిపోతున్న క్రమంలో బిజెపి అధికారాన్ని చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. శాసనసభలో అతి పెద్ద పార్టీ అయిన బిజెపి ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.