కర్ణాటక పోలీసు అధికారి రూ. 50 లక్షలు సీజ్ చేసి అందులో నుంచి రూ. 10 లక్షలు చోరీ చేశాడు. డాక్యుమెంట్‌లలో రూ. 40 లక్షలు మాత్రమే సీజ్ చేసినట్టు రాసుకొచ్చాడు. డబ్బులు సీజ్ చేయడంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో పోలీసు అక్రమ వ్యవహారం బట్టబయలైంది.
బెంగళూరు: కర్ణాటకలో ఓ పోలీసు సీజ్ చేసిన డబ్బుల నుంచి చోరీ చేశాడు. రూ. 50 లక్షలు సీజ్ చేసి అందులో నుంచి రూ. 10 లక్షలు దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ పోలీసు అధికారిని మహేంద్ర గౌడగా గుర్తించారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం, చన్నపట్టణ పట్టణంలోని రామాపుర గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్, రైతు లింగేశ్ పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకుని బెంగళూరుకు వచ్చాడు. రూ. 2000ల డినామినేషన్‌లు త్వరలో బ్యాన్ చేస్తారని, వాటిని వెంటనే రూ. 500 నోట్లలోకి మార్చుకోవాలని ఓ మిత్రుడు లింగేష్‌కు సూచించారు. అది నిజమే అని నమ్మిన లింగేష్ తన దగ్గర ఉన్న రూ. 50 లక్షలు తీసుకుని బెంగళూరుకు వచ్చాడు. అక్కడ ఆ డబ్బులు తీసుకుని రూ. 500 నోట్లలోకి మార్చుకోవడానికి (పది శాతం కమిషన్‌తో) ముందుగానే సిద్ధం చేసుకున్నారు. బెంగళూరు యూనివర్సిటీ జననభారతి క్యాంపస్‌కు చేరుకున్న ఆయన.. నోట్ల మార్చడానికి సిద్ధంగా ఉన్న వారు అంతా కలిసి చంద్ర లేఔట్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వెళ్లారు.
అదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ గౌడ అక్కడికే పెట్రోలింగ్ చేయడానికి వెళ్లారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకున్నారు. భారీ మొత్తంలో ఉన్న క్యాష్‌ను చూశారు. అందులో నుంచి తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని పోలీసు డిమాండ్ చేశాడు.
రూ. 50 లక్షల క్యాష్‌ను సీజ్ చేసిన గౌడ.. రూ. 40 లక్షలు మాత్రమే పేపర్‌ల పై చూపించారు. మిగతా రూ. 10 లక్షల క్యాష్‌ను చోరీ చేశారు. అయితే, లింగేష్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది నిజమే అని తేలింది. మరో వ్యక్తిని కూడా ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పాత్ర ఇంకా బయటకు రావాల్సి ఉన్నది. కరెన్సీ నోట్ల మార్పిడికి సంబంధించిన వ్యవహారంపై పూర్తి వివరాలు పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
