కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ రాకెట్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.
Karnataka MLA Arrest : బెట్టింగ్ వ్యవహారంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. దేశవ్యాప్తంగా బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో భారీగా నగదు పట్టుబడింది. ఇలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో జరిగిన భారీ బెట్టింగ్ రాకెట్ కేసును పోలీసులు చేధించారు.. ఇందులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.
ఈడి అధికారులు ఆగస్టు 22, 23, 2025 తేదీల్లో గాంగ్‌టక్, చిత్రదుర్గ, బెంగళూరు, హుబ్లీ, జోధ్‌పూర్, ముంబై, గోవాతో సహా 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గోవాలో పప్పీస్ క్యాసినో గోల్డ్, ఓషన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినో అనే ఐదు క్యాసినోలపై కూడా దాడులు జరిగాయి.
King567, Raja567 పేరుతో నిందితుడు అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లను నడుపుతున్నట్లు సోదాల్లో వెల్లడైంది. నిందితుడి సోదరుడు కె.సి. తిప్పేస్వామి దుబాయ్ నుండి డైమండ్ సాఫ్ట్‌టెక్, టీఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్9టెక్నాలజీస్ అనే 3 వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నాడని, ఇవి కె.సి. వీరేంద్ర కాలసెంటర్ సర్వీసులు, గేమింగ్ వ్యాపారానికి సంబంధించినవని ఆరోపణలు ఉన్నాయి.
రూ.12 కోట్లు, విదేశీ కరెన్సీ, బంగారం, వాహనాలు స్వాధీనం
ఈడీ సోదాల్లో రూ.12 కోట్ల నగదు, దాదాపు రూ.1 కోటి విలువైన విదేశీ కరెన్సీ, రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు, 10 కిలోల వెండి వస్తువులు, నాలుగు వాహనాలు పట్టుబడ్డాయి… వీటిని స్వాధీనం చేసుకున్నారు. 17 బ్యాంక్ ఖాతాలు, 2 బ్యాంక్ లాకర్లను స్తంభింపజేశారు. కె.సి. వీరేంద్ర సోదరుడు కె.సి. నాగరాజ్, అతని కుమారుడు పృథ్వీ ఎన్. రాజ్ ఇళ్ల నుండి ఆస్తులకు సంబంధించిన అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనేక ప్రాంతాల నుండి అనేక అనుమానాస్పద పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఎమ్మెల్యే వీరేంద్ర సోదరుడు కె.సి. తిప్పేస్వామి, పృథ్వీ ఎన్. రాజ్ దుబాయ్ నుండి ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కె.సి. వీరేంద్ర తన సహచరులతో కలిసి బాగ్‌డోగ్రా మీదుగా గాంగ్‌టక్‌కు వెళ్లి ల్యాండ్ క్యాసినోను లీజుకు తీసుకున్నట్లు వెల్లడైంది.కె.సి. వీరేంద్రను గాంగ్‌టక్‌లో అరెస్ట్ చేసి సిక్కిం న్యాయమూర్తి ముందు హాజరుపరిచి… బెంగళూరుకు తరలించి ఇక్కడ న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ట్రాన్సిట్ రిమాండ్ పొందారు.ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
