డబ్బుతో ఆడే ఆన్‌లైన్ గేమింగ్‌ని ప్రభుత్వం నిషేధించాలని నిర్ణయించింది. దీనికోసం లోక్‌సభలో బిల్లు ఆమోదం కూడా పొందింది. డబ్బును ప్రధానంగా పెట్టి ఆడే ఈ ఆటలు ఇక మనదేశంలో చెల్లవు. ఎంతో మంది ఈ ఆటల వల్ల ధనాన్నే కాదు ప్రాణాలను కూడా నష్టపోయారు.

ఆన్ లైగ్ గేమింగ్ వల్ల జరిగిన అరాచకాల గురించి ఎంత చెప్పిన తక్కువే. బెట్టింగ్ లు, జూదం ఆడి లక్షలు కోల్పోయి అప్పుల పాలై చివరికి ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువే. ఈ విషయంపై ఎన్నోసార్లు చర్చలు జరిగాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం ఆన్ లైగ్ గేమ్ లను నిషేధించాలని నిర్ణయించుకుంది. దీనికోసం ఆగస్టు 20న లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025 ను ప్రవేశపెట్టి ఆమోదాన్ని కూడా పొందింది. ఇప్పుడు ఈ బిల్లు రాజ్యసభకు చేరింది. అక్కడ కూడా ఆమోదం పొందితే అది అధికారికంగా చట్టంగా మారుతుంది. అన్ని రకాల ఆన్‌లైన్ గేమ్‌లపై నిషేధం విధించడం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా మనదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ అనేది పెద్ద పరిశ్రమగా ఎదిగింది. కానీ ఎంతో మంది ప్రజలు ఆ ఆటల్లో లక్షల కొద్దీ డబ్బులను పెట్టి భారీగా నష్టపోయారు. అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడం, ఆత్మహత్య చేసుకోవడం వంటివి చేశారు. 

ఆన్‌లైన్ గేమింగ్‌లో ఎంత డబ్బు కోల్పోతారు?

ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ఇప్పటికే ఈ నిషేధంపై అనేక వాదనలు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజల రక్షణ కోసం ఈ గేమింగ్ వ్యవస్థను అణిచివేసేందుకే నిర్ణయించుకుంది. అంచనాల ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 45 కోట్ల మంది ఈ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు, రమ్మీ వంటి ఆటల్లో ₹20,000 కోట్లు కోల్పోతున్నారు. అందుకే ఆన్‌లైన్ గేమింగ్ సమాజానికి పెద్ద సమస్యగా మారినట్టు ప్రభుత్వం గుర్తించింది. అందుకే నిషేధం విధించాలని నిర్ణయించుకుంది. ప్రజలకు ఆదాయ నష్టాన్ని కలిగించే అంశాలేవైనా ఇలా నిషేధానికి గురవ్వక తప్పదు.

బిల్లులో ఏముంది?

సమాచారం ప్రకారం, లోక్ సభలో కొంతమంది పార్లమెంటు సభ్యులు ఆన్‌లైన్ గేమింగ్ వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాల గురించి మాట్లాడారు. సామాజిక సంక్షేమం కోసం ఈ గేమింగ్ వ్యవస్థ వల్ల వచ్చే డబ్బును వదులుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025లో ఇ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమింగ్‌ గురించి నియమాలు ఉంటాయి. దీనికోసం ఒక బడ్జెట్ కూడా ఉంటుంది. వాటి ప్రచారం కోసం పథకాలు, అథారిటీని ఏర్పాటు చేస్తారు. అయితే డబ్బును కోల్పోయేలా ఏ ఆట ఉన్నా కూడా దాన్ని నిషేధిస్తారు.

ఈ బిల్లు చెబుతున్న ప్రకారం ఇంకా ఏవైనా కంపెనీలు ఆన్ లైన్ గేమింగ్ లో డబ్బు డిపాజిట్ చేసి ఆడే ఆటలను పోత్సహిస్తే ఆయా కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. నిందితులకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా ₹1 కోటి వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అదే సమయంలో, నియమాలను ఉల్లంఘించి ప్రకటనలు ఇస్కితే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా ₹50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

సోషల్ గేమ్‌లకు ప్రోత్సాహం

జూదం, బెట్టింగ్ వంటి ఆటలు పూర్తిగా నిషిద్ధం. డబ్బులు పెట్టి ఆడే ఏ గేమింగ్ వ్యవస్థ అయినా ఇకపై నడవదు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఏదైనా డబ్బు ఆధారిత గేమ్‌ను అందించడం, దానిని ప్రచారం చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం అవుతుంది. అదే సమయంలో, ఫ్రీ ఫైర్ వంటి ఇ-స్పోర్ట్స్, సోషల్ గేమ్‌లను ప్రోత్సహిస్తారు. ఎందుకంటే అవి డబ్బు లేకుండా ఆడుకోవచ్చు. ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాలుగా ఈ దిశగా పనిచేస్తూనే ఉంది. ప్రజలు, వారి ప్రజా ప్రతినిధుల నుండి అనేక ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం బిల్లు నిబంధనలను రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇప్పుడది అమల్లోకి రాబోతోంది.