కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి కాంగ్రెస్ నాయకత్వం ప్రతిఫలమిస్తుందని, ఈ విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతానని  కర్ణాటక రాష్ట్ర యూనిట్ చీఫ్ డికె శివకుమార్ అన్నారు. అలాగే..  జేడీఎస్‌తో కాంగ్రెస్ జట్టుకట్టాల్సిన అవసరం లేదని అన్నారు.

కర్ణాటక రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. గెలుపు కోసం అధికార, ప్రతి పక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విల్లూరుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక సీఎం పీఠంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డి.కె.శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఎన్‌డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారని ప్రశ్నించగా.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ, “నేను పార్టీకి నమ్మకమైన కార్యకర్తను, పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయలేదు. కర్నాటకలో గెలుస్తాం, ఆపై నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేస్తాం... పార్టీని ఆదరించిన వారికి హైకమాండ్ ఎప్పుడూ అండగా ఉంటుంది.వారిపై మాకు నమ్మకం ఉంది.. నా నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది." అని అన్నారు. 

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అని పిలువబడే రాష్ట్ర అధ్యక్షుడు డి.కె. శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు చేపట్టి.. పార్టీ మళ్లీ పుంజుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. తనకు నిద్ర కూడా పట్టడం లేదని, రాష్ట్రంలోని ప్రతి మూల ప్రాంతానికెళ్లి... భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా పార్టీని బలోపేతం చేశామని, ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చామని ఆయన అన్నారు. 

ఆయన ఇంకా మాట్లాడుతూ.. తనకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యతో అంతర్గత పోరు ఉందనే వార్తలను శివకుమార్ కొట్టిపారేశారు. సిద్ధరామయ్య కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీదారుగా పరిగణించబడుతున్నారనీ, ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని, తమను విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని శివకుమార్ అన్నారు. తప్పుడు వార్తలు, పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా ఉన్నామనీ, బీజేపీని ఓడించి కర్ణాటకలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడమే తమ ఉమ్మడి లక్ష్యమని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలపై తమ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, ఈ ఎన్నికల్లో దాదాపు 140 సీట్లు వస్తాయన్న విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ దీమా వ్యక్తం చేశారు.

అదే సమయంలో హెచ్.డి. కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్)తో పొత్తు పెట్టుకునే అవకాశాలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఆదేశం రాకపోయినప్పటికీ బీజేపీతో చేతులు కలిపి రెండుసార్లు ప్రజలను జేడీఎస్ మోసం చేసిందని, అందుకే జేడీఎస్‌తో పొత్తు ప్రశ్నే లేదని అన్నారు. హెచ్.డి. కుమారస్వామి తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, ఆయన నిజానిజాలు ప్రజలకు తెలిశాయన్నారు. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోబోం.. సర్వశక్తులు ఒడ్డి పోరాడతాం...’’ అని కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు.

ఈ క్రమంలో బి.ఎస్.యడ్యూరప్పపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు గతేడాది జూలైలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందనీ, ఈ విషయంలో బి.ఎస్. యడియూరప్ప తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అన్నారు. యడ్యూరప్పకు బీజేపీ నుంచి సీఎం పదవి వచ్చేది కాదని, ప్రధాని నరేంద్ర మోదీని ప్రొజెక్ట్ చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని, అయితే కర్ణాటకలో ఆయన రాణించలేకపోయారని శివకుమార్ విమర్శించారు.