Bengaluru: కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఎన్నికలకు సంబంధించి పొత్తు పెట్టుకునే ఆఫర్లు ఇచ్చాయని జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. ఈ రెండు పార్టీలకు తమ బలం గురించి తెలుసునని పేర్కొన్నారు.
Karnataka Assembly elections 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. గెలుపు పై కాంగ్రెస్, బీజేపీలతో పాటు జేడీఎస్ సైతం ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు-పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు తమ బలం గురించి తెలుసునని వ్యాఖ్యానించారు. అందుకే ఆ రెండు పార్టీలు పొత్తు విషయంలో ఆఫర్లు ఇచ్చాయని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. కాంగ్రెస్, బీజేపీలు ఎలాగైన కర్నాటకలో అధికారం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కీలకంగా ఉన్న జేడీఎస్ తో పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఇదే విషయం గురించి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఎన్నికలకు సంబంధించి పొత్తు పెట్టుకునే ఆఫర్లు ఇచ్చాయని జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. ఈ రెండు పార్టీలకు తమ బలం గురించి తెలుసునని పేర్కొన్నారు. ఒక మీడియా ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ.. తమ ఎన్నికల వ్యూహం గురించి వివరించారు.
కుమారస్వామి గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపారు. అయితే, రెండు జాతీయ పార్టీలతో తనకు సంబంధాలు ఉన్నాయని, ప్రజాతీర్పు తమ పార్టీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. టైమ్స్ నౌ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కుమారస్వామి బీజేపీ రిజర్వేషన్ విధానాన్ని విమర్శించే ముందు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వ్యూహాన్ని వివరిస్తూ.. "136-140 నియోజకవర్గాలపై సీరియస్ గా దృష్టి సారించాం. ఇది అతివిశ్వాసం కాదు. సామాన్యులకు చేరువయ్యాం. బీజేపీ, కాంగ్రెస్ సర్వేలను పట్టించుకోవడం లేదు. అంతకు ముందు జేడీఎస్ పని అయిపోయిందని చెప్పిన వారు... మేము 15 సీట్లకు మించి గెలవమన్నారు. కానీ ఇప్పుడు 40 నుంచి 45 సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. ఇంతకీ వారి ఆలోచన మారడానికి కారణమేంటి?.." అని ఆయన ప్రశ్నించారు.
"ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 50 నుంచి 70 గ్రామాలకు చేరుతున్నాం. పరిస్థితి చూస్తుంటే 80కి పైగా సీట్లు గెలుచుకోగలం. అభ్యర్థుల ప్రకటన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతాయి. దీంతో 10 నుంచి 15 సీట్లలో ఆధిక్యం లభిస్తుంది. గత ఎన్నికల్లో మా లోపాలను పరిష్కరించుకున్నామని" కుమారస్వామి తెలిపారు. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో బీజేపీ విజయావకాశాలపై మాట్లాడుతూ... "ప్రధాని నరేంద్ర మోడీ అండ్ కో ఏం చేసినా ఆ ప్రాంత ప్రజలను గెలిపించుకోలేరు. మనకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలు అలాగే ఉంటాయి. ఆయన వందసార్లు పర్యటించినా ప్రజల మనసులు మారవు. కర్ణాటకకు సాయం అవసరమైనప్పుడు కేంద్రం సాయం చేయలేదు. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ రాష్ట్రాన్ని దోచుకుంటోందన్నది వాస్తవం. సామాన్యులకు అన్నీ తెలుసు" అంటూ వ్యాఖ్యానించారు.
