దీపావళి సందర్భంగా సీఎంవోలోని ఓ అధికారి మీడియా ప్రతినిధులకు స్వీట్లతో పాటు లక్షల్లో నగదును బహుమతిగా పంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై సర్కార్ వివాదంలో చిక్కకుంది.
కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దీపావళి సందర్భంగా సీఎంవోలోని ఓ అధికారి మీడియా ప్రతినిధులకు స్వీట్లతో పాటు లక్షల్లో నగదును బహుమతిగా పంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తక్షణం ఈ ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
అసలేం జరిగిందంటే:
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటకకు చెందిన పలు మీడియా సంస్థలకు చెందిన 12 మంది సీనియర్ జర్నలిస్టులకు సీఎంవో నుంచి స్వీటు బాక్సులు పంపారు. అయితే అందులో మిఠాయిలతో పాటు రూ.లక్షల్లో నగదు వున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా కొందరు జర్నలిస్టులు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సీఎంవోకు స్వీటు బాక్సును తిరిగి పంపినట్లుగా సమాచారం. అంతేకాదు .. ఈ ఘటనపై ఓ స్వచ్ఛంధ సంస్థ కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నుంచి మీడియా ప్రతినిధులకు ఈ బహుమతులు వెళ్లినట్లు ఫిర్యాదులో ఆ సంస్థ పేర్కొంది.
Also Read:కర్ణాటక కాంగ్రెస్ అవినీతి వివరాలు పంపిస్తా.. రాహుల్ గాంధీపై బసవరాజ్ బొమ్మై ఫైర్
ఇకపోతే.. కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ బీజేపీ-ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పోటాపోటీ పాదయాత్రలు చేయడానికి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు సాగుతున్న భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఉంది. ఈ యాత్రలో భాగంగా బాల్లారిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వం రాహుల్ గాంధీకి మతిమరుపు అంటూ ఘాటు వ్యాఖ్యలతో విమర్శించింది,
కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి వివరాలను రాహుల్ గాంధీకి పంపిస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. బళ్లారిలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో రాష్ట్రంలో 40 శాతం కమిషన్ విచ్చలవిడి తనం కొనసాగుతున్నదని విమర్శించిన తర్వాత బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అవినీతిపై వాస్తవాలు, గణాంకాలను రాహుల్ గాంధీకి పంపుతానని బొమ్మై అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన కుంభకోణాల ఎఫ్‌ఐఆర్‌లపై విచారణ జరిపి కేసుల పత్రాలను పంపిస్తానని చెప్పారు.
