బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతుంది. తమ ప్రభుత్వానికి ఏమీ లేదని జేడీఎస్-కాంగ్రెస్ ప్రకటిస్తుంటే తమకు అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 

ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు క్యాంపు రాజకీయాలు సైతం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి ట్విస్ట్ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కుమార స్వామి. 

కర్ణాటక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సీఎం కుమారస్వామి వ్యూహాత్మక ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి కుమారస్వామి సిద్ధమని కుమారస్వామి ప్రకటించారు.  

అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్పీకర్ ఎప్పుడు సమయం కేటాయిస్తే అప్పుడే విశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

ఇకపోతే బీజేపీని దెబ్బకొట్టేందుకే కుమార స్వామి వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం ప్రకటించారని తెలుస్తోంది. బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టకముందే విశ్వాసాన్ని నిరూపించుకోవాలని కుమార స్వామి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు చేస్తున్న తరుణంలో బీజేపీని ఇరుకున పెట్టి మళ్లీ సీఎం కుర్చీ ఎక్కాలని కుమార స్వామి ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది.