దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు తమకు తాముగా లాక్‌డౌన్ విధించుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి.

తాజాగా ఈ లిస్ట్‌లో కర్ణాటక చేరింది. రాష్ట్రంలో కేసులు అదుపులోకి రాకపోవడంతో పాటు నానాటికీ బాధితులు పెరిగిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నెల 10వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.  

Also Read:కరోనా సెకండ్ వేవ్ : మే 10 నుంచి రాజస్థాన్ లో లాక్ డౌన్..

లాక్‌డౌన్‌ సమయంలో అన్ని హోటళ్లు, పబ్బులు, బార్లు మూసివేయాలని సీఎం ఆదేశించారు. నిత్యావసర, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఓపెన్ చేసేందుకు ఆయన వెసులుబాటు కల్పించారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 10 గంటల తర్వాత ఒక్కరిని కూడా బయటకు అనుమతించేది లేదని యడియూరప్ప స్పష్టం చేశారు. అయితే, ఇది తాత్కాలిక లాక్‌డౌన్‌ మాత్రమేనని, వలస కార్మికులెవరూ స్వస్థలాలకు వెళ్లొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.