కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం రోజు ‘శక్తి పథకాన్ని’ ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ క్రమంలోనే బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వాహనాల మళ్లింపుకు సంబంధించిన అడ్వైజరీని జారీ చేశారు.  

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం రోజు ‘శక్తి పథకాన్ని’ ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఐదు హామీల్లో మొదటిదైన ‘శక్తి పథకాన్ని’ ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుంది. బెంగళూరులోని విధానసౌధ వద్ద ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సజావుగా సాగేందుకు.. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వాహనాల మళ్లింపుకు సంబంధించిన అడ్వైజరీని జారీ చేశారు.

ఇందులో భాగంగా.. వాహనాలు కేఆర్ సర్కిల్ నుంచి బాలేకుండ్రి సర్కిల్ వరకు, అదే సమయంలో బాలేకుండ్రి సర్కిల్ నుంచి కేఆర్ సర్కిల్ వైపు అనుమతించబడవు. కేఆర్ సర్కిల్ నుంచి వెళ్లే వాహనాలు నృపతుంగ రోడ్డుకు మళ్లిస్తారు. మరోవైపు బాలేకుండ్రి సర్కిల్ నుంచి క్వీన్స్ సర్కిల్ వైపు వాహనాలను మళ్లించనున్నారు. 

అయితే సీటీవో సర్కిల్ నుంచి వెళ్లే వాహనాలు రాజ్‌భవన్ రోడ్డు వైపు వెళ్లవచ్చు. కేఆర్ సర్కిల్ వైపు ఎడమ మలుపు అనుమతించబడదు. ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఈ విషయాన్ని గమనించి.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇక, శక్తి పథకం ప్రారంభోత్సంకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకారం.. సిద్ధరామయ్య మెజెస్టిక్ బస్ స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సు నంబర్‌లో ఎక్కి కండక్టర్ పాత్రను స్వీకరిస్తారు. విధాన సౌధ‌కు యాత్రలో ముఖ్యమంత్రి మహిళా ప్రయాణికులకు ‘శక్తి స్మార్ట్‌కార్డు’లను పంపిణీ చేయనున్నారు.