బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో జరిగిన బలనిరూపణ పరీక్షలో ఓటమిపాలవ్వడంతో  కుమార స్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో కుమార స్వామి నేరుగా అసెంబ్లీ నుంచి రాజ్ భవన్ కు బయలుదేరారు. 

ఓడిపోయిన వెంటనే ఆయన ఒక మధ్యతరగతి మనిషిని అంటూ ప్రకటించుకున్నారు. పదవీచ్యుతిడు కావడంతో ప్రభుత్వ సదుపాయాలను సైతం వదులుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్, రేవణ్ణలతోపాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కాలినడకన రాజ్ భవన్ కు చేరుకున్నారు. 

గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసి తన రాజీనామాను సమర్పించారు. ఇంతకాలం తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అటు గవర్నర్ వాజుభాయ్ వాలా సైతం కుమారస్వామికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అంతకుముందు కుమారస్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై స్పీకర్ రమేష్ కుమార్ డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. అసెంబ్లీలో హాజరైన ఎమ్మెల్యేల సంఖ్యప్రకారం మేజిక్ నంబర్ 103గా నిర్ధారించారు. 

అయితే బలనిరూపణ పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 99 ఓట్లు రాగా బీజేపీకి 105 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బలనిరూపణ పరీక్ష వీగిపోయిందంటూ స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు.  

ఇకపోతే కుమారస్వామి గత ఏడాది మే 23న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే దాదాపు 14 నెలలు పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం బలనిరూపణ పరీక్షలో ఓటమితో అధికారానికి దూరమయ్యారు. ముఖ్యమంత్రిగా బలనిరూపణ పరీక్షలో ఓడిపోవడం కుమారస్వామికి ఇది రెండోసారి కావడం గమనార్హం.