కరోనా కారణంగా రోజువారీ జీవితం పూర్తిగా మారిపోయింది. ఏళ్లుగా ఒకే రకంగా సాగుతున్న వ్యవహారాలన్ని కొత్త రూపును సంతరించుకున్నాయి. వాటిలో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్, కార్పోరేట్ వర్గాలకే పరిమితమైన ఈ సదుపాయం... కోవిడ్ 19 కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అందింది.

ఈ క్రమంలో తాను ఇకపై కొద్దిరోజులు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. కరోనాపై శుక్రవారం బెంగళూరు మున్సిపల్ కార్పోరేషన్‌లోని 198 మంది కార్పోరేటర్లతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించాల్సి  వుంది.

అయితే ఆయన వద్ద పనిచేసే సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తాను ఇంటి నుంచి పనిచేయనున్నట్లు చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ప్రజలెవరూ భయపడొద్దని యడ్యూరప్ప విజ్ఞప్తి సూచించారు.

ఆన్‌లైన్ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తానని తెలిపారు. ఈ విషయానికంటే ముందు యడ్యూరప్ప కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా కరోనా సెంటర్‌ కోసం బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్‌లో 10 వేల బెడ్‌లు ఏర్పాటు చేసినట్లు సీఎంవో తెలిపింది.

ప్రజలంతా కోవిడ్ 19 గైడ్‌లైన్లను ఫాలో అవుతూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని ముఖ్యమంత్రి కోరారు. కాగా కర్ణాటకలో ఇప్పటి వరకు 30,000లకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.