Asianet News TeluguAsianet News Telugu

సీఎంకే నివాసం లేదు.. మరోదారి లేక వర్క్ ఫ్రమ్ హోం

కర్ణాటక కొత్త సీఎం బసవరాజు బొమ్మైకి అధికారిక నివాసం కరువైంది. గత ముఖ్యమంత్రులు తమ వాస్తు, అస్ట్రాలజీ విశ్వాసాలతో చేరిన బంగ్లాలను వదలడం లేదు. రాష్ట్రంలోనూ సీఎంకు అధికారిక నివాసం ఇది అని గుర్తింపు లేకుండా పోవడంతో ఈ సమస్య తలెత్తింది. తాజా మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అధికారిక కావేరీ బంగ్లాను వీడబోరని తెలిపినట్టు సమాచారం. ఆయననూ ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించే సాహసం బొమ్మై చేయబోరనీ తెలుస్తున్నది.

karnataka cm basavaraj bommai does not have official residency
Author
Bengaluru, First Published Aug 12, 2021, 5:36 PM IST

బెంగళూరు: కర్ణాటక విచిత్ర పరిస్థితి ఎదురైంది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి ఉండటానికి అధికారిక నివాసం కరువైంది. దీంతో మరోదారి లేక ప్రస్తుతం ఆయన ఉంటున్న సొంత నివాసం నుంచే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. సమావేశాల కోసం ఆర్టీ నగర్‌లోని కుమార కృప ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌ను వినియోగించుకుంటున్నారు. తాజా మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సెంట్రల్ బెంగళూరులోని అధికారిక నివాసం కావేరీ బంగ్లాలోనే కొనసాగుతారని పేర్కొన్నట్టు తెలిసింది. ఆయన తర్వాత సీఎం పీఠాన్ని అధిరోహించిన బసవరాజు బొమ్మై.. బీఎస్ యడియూరప్పను ఖాళీ చేయాల్సిందేనని తెగేసి చెప్పలేడు. ఫలితంగా కొత్త సీఎం బసవరాజు బొమ్మైకే అధికారిక నివాసం లేకుండాపోయింది. 

విచిత్రంగా బెంగళూరులో ప్రభుత్వ గుర్తింపున్న మరే బంగ్లా కూడా సీఎం బసవరాజు బొమ్మైకి లేకుండా పోవడం గమనార్హం. దశాబ్దాలుగా సీఎం పదవి అధిరోహించిన వారు వాస్తు, ఆస్ట్రాలజీ నమ్మకాలతో బంగ్లాలు విడిచిపెట్టడం లేదు. ఈ పరిస్థితులే ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి అధికారిక నివాసం లేకుండా పోవడానికి కారణమైందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ పక్కనే ఉన్న రేస్ వ్యూ కాటేజీకి మారే అవకాశముందని వివరించారు. రాష్ట్రంలో కావేరీ, అనుగ్రహ మినహా ఇతర బంగ్లాల్నీ చిన్నవిగానే ఉంటాయి. సీఎం అధికారిక నివాసానికి ఉపయుక్తంగా ఉండవు. కావేరీ బంగ్లాలో బీఎస్ యడియూరప్ప కొనసాగుతుండగా, అనుగ్రహలో లోకాయుక్త జస్టిస్ విశ్వనాథ్ శెట్టిలు నివాసముంటున్నారు. అంతకు ముందు ఈ బంగ్లాలో మాజీ సీఎం ఎస్ఎం క్రిష్ణ ఉండేవారు.

యడియూరప్ప ఎమ్మెల్యే మినహా మరే అధికారిక పదవి కలిగిలేరు. ఆయనకు అధికారిక నివాసంలోనే కొనసాగాలని లేదు. కానీ, ఇటీవలే బసవరాజు బొమ్మై అతనికి క్యాబినెట్ ర్యాంకు హోదానిచ్చింది. ఆ హోదాను బీఎస్ యడియూరప్ప తిరస్కరించిన సంగతి తెలిసిందే.

గతంలోనూ సిద్ద రామయ్య సీఎం పదవి కాలం ముగిసిన తర్వాత కూడా కావేరీ బంగ్లాలోనే కొనసాగారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుమారస్వామి గౌడ ఆ నివాసం కోసం వినతి చేసుకున్నా లాభం లేకపోయింది. దీంతో కుమారస్వామి తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో కొనసాగారు. అనంతరం యడియూరప్ప సీఎం కుర్చీనెక్కిన తర్వాత కూడా సిద్ద రామయ్య ససేమిరా అన్నారు. చివరకు నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. నోటీసులు జారీ చేసిన తర్వాతే రామయ్య బంగ్లా ఖాళీ చేయగా, యడియూరప్ప అందులోకి చేరారు.

ముఖ్యమంత్రులు, వారి కుటుంబ సభ్యుల వాస్తు, అస్ట్రాలజీ నమ్మకాలతోనే ఈ దుస్థితి దాపురించిందని సీఎంవోకు చెందిన ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రభుత్వాధికారులు పెద్ద పెద్ద భవంతులను ఆలోచించకుండానే గెస్ట్ హౌజ్‌లు, ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చేశారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కావేరీని కర్ణాటక సీఎం అధికారిక నివాసంగా ప్రకటిస్తేనే భవిష్యత్ సీఎంలకు ఈ బాధ తప్పుతుందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios