కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై..  777 చార్లీ సినిమా చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సినిమాలో కుక్కకు, మనిషికి మధ్య అనుబంధాన్ని చిత్రించారు. ఈ సినిమా చూసి సీఎం తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న పెట్ డాగ్ గుర్తొచ్చి కంటనీరు పెట్టుకున్నారు.

బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి ఉన్నతమైనది. ఆ హోదాలో ముఖ్యమంత్రులు గంభీరంగా వ్యవహరిస్తారు. పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. కానీ, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై మాత్రం ఓ సినిమా చూసి చిన్న పిల్లాడిలో ఏడ్చేశాడు. ఆయన నిన్న కర్ణాటకలో చార్లీ 777 అనే సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చి కంటనీరు పెట్టుకున్నారు. ఇందుకు కారణం ఆయన పెంపుడు కుక్క గుర్తుకు రావడమే.

సీఎం బసవరాజు బొమ్మై ఒక డాగ్ లవర్. ఆయన ఎంతో ఇష్టంగా, ప్రేమగా పెంచుకున్న, చూసుకున్న పెట డాగ్ స్నూబీ మరణించింది. బసవరాజు బొమ్మై సీఎం పదవి అధిరోహించడానికి కొన్ని వారాల ముందు ఈ ఘటన జరిగింది. తన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు సీఎం బసవరాజు బొమ్మై బోరున విలపించాడు. ఆ కుక్క డెడ్ బాడీకి పూల మాల వేసి ఉండగా.. ఆయన తన మోకాళ్లపై కూర్చుని కన్నీటి పర్యంతమైన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

777 చార్లీ సినిమా జూన్ 10న ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో హీరో, ఆయన కుక్కకు మధ్య ఉన్న బాండింగ్‌ను హృద్యంగా చిత్రించారు. ఈ సినిమా చూసిన సీఎం బసవరాజు బొమ్మై తనకు 777 చార్లీ సినిమా చాలా నచ్చిందని వివరించారు. సినిమాను నిర్మించినవారిని పొగడ్తల్లో ముంచెత్తారు. అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరారు.

Scroll to load tweet…

కుక్కలపై చాలా సినిమాలు వచ్చాయని, కానీ, ఈ సినిమా భావోద్వేగాలు, జంతువులపై ప్రేమను సహజంగా చిత్రించిందని వివరించారు. కుక్క దాని ఎమోషన్స్‌ను కళ్ల ద్వారా వెలువరిస్తుందని తెలిపారు. ఈ సినిమా బాగుందని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని పేర్కొన్నారు. తాను ఎప్పుడు షరతుల్లేని ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారని, డాగ్ లవ్ స్వచ్ఛమైన, షరతుల్లేని ప్రేమ అని అన్నారు.