Karnataka: రాష్ట్రంలో హిందూ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సంబంధించి తమ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.
Praveen Nettaru's Murder Case: బీజేపీ యువనేత ప్రవీణ్ నెట్టారు హత్య కర్నాటకలో సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఈ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకు సంబంధించి దక్షిణ కన్నడలో భారీ నిరసనల తర్వాత, ప్రవీణ్ హత్య కేసులో కర్నాటక పోలీసులు గురువారం నాడు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రవీణ్ హత్యకేసులో నిందితులను జాకీర్, షఫీక్‌లుగా గుర్తించినట్లు దక్షిణ కన్నడ ఎస్పీ సోనావానే రిషికేష్ తెలిపారు. జాకీర్‌ను హవేరీ జిల్లా సవనూరులో అరెస్టు చేయగా, షఫీక్‌ను బల్లారేలో అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు ప్రవీణ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. "నాకు బాగోలేదు. అతని తండ్రి కూడా హార్ట్ పేషెంట్. అతను మా ఒక్కడే కొడుకు. మా కోసం ఇల్లు కట్టాలని ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఎవరు కట్టిస్తారు?... దోషులను శిక్షించాలి, ఈ పని చేసిన వారెవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి" అని మృతుడి ప్రవీణ్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, బుధవారం దక్షిణ కన్నడలోని బెల్లారేలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దక్షిణ కన్నడ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ కారును అడ్డుకున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ప్రవీణ్ హత్యను దృష్టిలో ఉంచుకుని మన ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న ‘జనోత్సవ’ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసిందని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.
ఈ దారుణమైన చర్యను ఖండించిన కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఇది ఇతర కేసులకు సారూప్యత కలిగి ఉన్న ప్రణాళికాబద్ధమైన సంఘటనలా కనిపిస్తోంది అని సీఎం బొమ్మై అన్నారు. రాష్ట్రంలో హిందూ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సంబంధించి తమ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిస్థితిని ఎదుర్కోవాలని మేము నిర్ణయించుకున్నాము. సాధారణ విచారణలే కాకుండా ప్రత్యేక చట్టాలు రూపొందిస్తామన్నారు. అందుబాటులో ఉన్న వ్యవస్థతో పాటు నిఘా, మందుగుండు సామాగ్రితో కూడిన పూర్తి స్థాయి కమాండో దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అవసరమైతే మాత్రమే మతతత్వ శక్తులను ఎదుర్కోవడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నమూనాను రాష్ట్రం అనుసరిస్తుందని బసవరాజ్ బొమ్మై గురువారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సరైన నిర్ణయాలను తీసుకున్నారని, అయితే కర్నాటకలో సమస్యలను ఎదుర్కోవటానికి అనేక నియంత్రణ యంత్రాంగాలు ఉన్నాయని అన్నారు. అయితే, అవసరమైతే యోగి నమూనాను తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.
