Karnataka BJP MLA daughter : కర్ణాటకలోని బెంగళూరులో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి కుమార్తె అతివేగంతో కారును నడుపుతూ.. సిగ్నల్ క్రాస్ చేసింది. పైగా ఆమె అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయింది. మీడియా ప్రతినిధిపై దాడికి యత్నించింది.
Karnataka BJP MLA daughter: కర్ణాటకలోని బెంగళూరులో ఓ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత కుమార్తె వీరంగం సృష్టించింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో పాటు.. జరిమానా విధించిన పోలీసు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. అదే కాకుండా.. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఓ జర్నలిస్ట్ పై చేయి చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన రెండు రోజుల కిత్రం బెంగళూరులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో బీజేపీ నాయకుడి కుమార్తె తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. కర్నాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి కుమార్తె అతివేగంతో కారును నడుపుతూ.. సిగ్నల్ క్రాస్ చేసింది. దీంతో ఆమె వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని జరిమానా విధించారు. దీంతో ఎమ్మెల్యే కుమార్తె రెచ్చిపోయింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారిని నోటికి వచ్చినట్టు తిట్టింది. అంతటితో ఆగకుండా..ఈ ఘటనను రికార్డు చేస్తున్న ఓ కర్ణాటక న్యూస్ ఛానల్ జర్నలిస్ట్‌పై ఆమె చేయిచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.
కర్ణాటక న్యూస్ ఛానల్ తీసిన వీడియోలో, "నేనెవరో మీకు తెలుసా? మీకు ఎమ్మెల్యే అరవింద్ లింబావలి తెలుసా? నేను అరవింద్ లింబావలి కూతురిని" అని ఆ మహిళ చెప్పడం వినిపిస్తోంది. ఆమె
మీడియాపై కూడా విరుచుకుపడింది. "కెమెరాను ఆపివేయి. దాన్ని మూసేయండి. నువ్వు ఎక్కడ నుండి వచ్చావ్ ?" అని దురుసుగా ప్రవరిస్తూ.. మీడియా ప్రతినిధిపై దాడికి యత్నించింది.
కానీ, ట్రాఫిక్ పోలీసులు మాత్రం.. ఎమ్మల్యే కూతురిని విడిచిపెట్టలేదు. ఆమె నడుపుతున్న బీఎండబ్ల్యూ కారుపై రూ.9000 ల పెండింగ్ చలానాలు ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. తాజాగా ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు సిగ్నల్ జంపింగ్ కు మరో రూ.1,000 ఫైన్ వేసి మొత్తం రూ.10,000 చెల్లించాలని చెప్పారు. కొద్దిసేపు.. వాదించిన ఎమ్మెల్యే కుమార్తె చివరకు .. మొత్తం చలానాలను చెల్లించి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.
ఈ ఘటనపై జనతాదళ్ (సెక్యులర్) స్పందించింది. JDS అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ చర్య సిగ్గుచేటని, ఎమ్మెల్యే కుమార్తె చట్టాన్ని పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. లా అండ్ ఆర్డర్ నుండి తప్పించుకోవడానికి తన తండ్రి గుర్తింపును ఉపయోగించుకోవడాన్ని తీవ్రంగా తప్పు బట్టారు. ఇది అరవింద్ లింబావలీ కుమార్తె ప్రశ్న కాదని. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయనీ, పిల్లలు మొదట తమ తల్లిదండ్రులు ప్రజా సేవకులని తెలుసుకోవాలని, ఇది ఇబ్బందికరం.. సిగ్గుచేటని విమర్శించారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఇది బీజేపీ అరాచకాలకు నాంది అని పేర్కొంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిజాం ఫౌజ్దార్ స్పందించారు. రాబోయేవి చెత్త రోజులని హెచ్చరించారు. "ఇది ప్రారంభం మాత్రమే. ఇది బిజెపి అరాచక పాలన. రాష్ట్రంలో అణగారిన వర్గాలపై ఆధిపత్యం చెలాయిస్తుంది. రాబోయే రోజుల్లో మీరు చాలా దారుణమైన రోజులు చూస్తారు. ఆందోళన చెందవద్దని, చట్టం గెలుస్తుంది. ఈ చర్య BJP సంస్కృతిలో అంతర్భాగం. మనం ఎందుకు ఆశ్చర్యపడాలి?" అని ట్వీట్ చేశారు.
