Karnataka: కర్నాటకలో బీజేపీ నాయకుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు రూ.లక్ష నగదు, బంగారం, వెండితో సహా పలు బహుమతులు అందజేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
Diwali gifts: కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు లక్షల రూపాయల నగదు, బంగారం, వెండి వస్తువులు సహా పలు బహుమతులను అందించాడు ఒక మంత్రి.. ఇది కాస్తా వైరల్ గా మారి.. సదరు మంత్రిగారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. కర్నాటకలో చోటుచేసుకున్న ఈ ఘటనకు బంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
కర్నాటకలోని హోసపేట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్ తన నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు ఖరీదైన దీపావళి కానుకలను అందించడం వివాదాస్పదమైంది. అతని ఇంట్లో లక్ష్మీ పూజ ఆహ్వానం ఒక పెట్టెలో వచ్చింది. ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు, మరొకటి గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు సెట్ల పెట్టెలను మంత్రి పంపిణీ చేశారు. అందులో బంగారం, వెండి, దుస్తులు, నగదు ఉన్నాయి. బాక్స్‌కి సంబంధించిన ఫోటోలు, అందులోని బహుమతులకు సంబంధించిన విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, దీనిపై ఆనయ వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
మునిసిపల్ కార్పొరేషన్ సభ్యులకు, మరొకటి గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు సెట్ల గిఫ్ట్ బాక్స్‌లను పంపిణీ చేశారు. మున్సిపల్ సభ్యులకు రూ.లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, కిలో వెండి, పట్టుచీర, ధోతి, డ్రైఫ్రూట్ బాక్స్‌ను అందజేయగా, పంచాయతీ సభ్యులకు తక్కువ నగదు, బంగారం కాకుండా ఇతర వస్తువులన్నీ వచ్చాయి. హోసపేట నియోజకవర్గంలో 35 మంది ఎన్నికైన, ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో ఒక మున్సిపల్ కార్పొరేషన్, 182 మంది సభ్యులతో 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొంతమంది ఎన్నికైన మున్సిపల్ సభ్యులు గిఫ్ట్ బాక్సులను తీసుకోవడానికి నిరాకరించారనీ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సింగ్ ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అయితే ప్రతి దీపావళికి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సింగ్ బహుమతులు పంపేవాడనీ, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల కారణంగా ఇది వివాదంగా మారిందని మద్దతుదారులు తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ముఖ్య వ్యక్తులకు కూడా ఈ గిఫ్ట్ బాక్సులను పంపినట్లు వారు తెలిపారు. “ప్రతియేడాది గణేశుడి పండుగా, దీపావళి పండుగల సమయంలో ఆహ్వానంలో భాగంగా సింగ్ బహుమతి పెట్టెలను పంపుతాడు. వాటిని తన సన్నిహితులకు, ప్రజాప్రతినిధులకు పంపిస్తాడు. అయితే, ఇప్పుడు ఈ అంశం ఎందుకు వివాదంగా మారిందో అర్థం కావడం లేదు”అని హోసపేటకు చెందిన ఆనంద్ సింగ్ మద్దతుదారుడు అన్నారు.
