కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకించారు.
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకించారు. ఎన్నికల రాజకీయాలకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈశ్వరప్ప నిర్ణయాన్ని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘‘గత 40 ఏళ్లలో పార్టీ నాకు చాలా బాధ్యతలు ఇచ్చింది. నేను బూత్ ఇన్‌చార్జి నుంచి రాష్ట్ర పార్టీ చీఫ్‌గా మారాను. ఉప ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా నాకు ఉంది’’ అని కన్నడలో సంక్షిప్త లేఖలో ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఈ నిర్ణయం తన ఇష్టానుసారం తీసుకున్నదనేనని వెల్లడించారు. ఇక, ఈశ్వరప్ప తన ప్రకటనలు, తనపై వచ్చిన ఆరోపణల కారణంగా తరచుగా వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఇక, మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే కర్ణాటకలోని అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ప్రకటించలేదు. అయితే రాష్ట్రంలో 75 ఏళ్లు పైబడిన రాజకీయ నేతలందరికీ టిక్కెట్లు ఇవ్వబోమని బీజేపీ అధిష్టానం పార్టీ నేతలకు సూచనప్రాయంగా తెలిపినట్టుగా తెలుస్తోంది. ఈశ్వరప్పకు జూన్ నాటికి 75 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలోనే ఈసారి షిమోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ రాదని అంచనా వేస్తూ బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటించకముందే.. తాను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటూ ఈశ్వరప్ప నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
