కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. రిపబ్లిక్ టీవీ - పీ మార్క్, టీవీ9 భరత్ వర్ష్ - పోల్‌స్ట్రాట్, జీ న్యూస్ మ్యాట్రిజ్ ఏజెన్సీలు కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. 

బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా ప్రచారం చేసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ముగియగానే మూడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి. రిపబ్లిక్ టీవీ - పీ మార్క్, టీవీ9 భరత్ వర్ష్ - పోల్‌స్ట్రాట్, జీ న్యూస్ మ్యాట్రిజ్ ఏజెన్సీలు విడుదల చేసిన అంచనాల్లో కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వస్తుందని పేర్కొన్నాయి. అయితే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందని వివరించాయి.

రిపబ్లిక్ టీవీ - పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో బీజేపీ 85 నుంచి 100 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని, అదే కాంగ్రెస్ 94 నుంచి 108 స్థానాలు, జేడీఎస్ 24 నుంచి 32 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఇతరులు 2 నుంచి 6 సీట్లు గెలుచుకుంటారని వివరించింది.

అదే టీవీ 9 భరత్‌వర్ష్ - పోల్‌స్ట్రాట్ బీజేపీకి 88 నుంచి 98 స్థానాలు, కాంగ్రెస్‌కు 99 నుంచి 109 సీట్లు, జేడీఎస్ 21 నుంచి 26 సీట్లు వస్తాయని వివరించింది. జీ న్యూస్ మ్యాట్రిజ్ ఏజెన్సీ కూడా హంగ్ అసెంబ్లీనే వస్తుందని తెలిపింది. బీజేపీకి 79 నుంచి 94 సీట్లు, కాంగ్రెస్‌కు 103 నుంచి 188 సీట్లు, జేడీఎస్ ‌కు 25 నుంచి 33 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రమే వెల్లడిస్తాయి. తుది ఫలితాలను ఎన్నికల సంఘం ఈ నెల 13వ తేదీన విడుదల చేయనుంది.

Also Read: Karnataka Elections 2023: ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎగ్జిట్ పోల్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?

కర్ణాటకలో 1985 తర్వాత వరుసగా అధికారంలోకి వచ్చిన పార్టీ లేదు. ఈ సారి కూడా ఇదే సంప్రదాయం పునరావృతమవుతమై కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? లేక దాన్ని బ్రేక్ చేసి బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుందా? అనే విషయం తేలాలంటే 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కానీ, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ(104 సీట్లు)గా నిలిచింది. దీంతో ఈ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. కానీ, కాంగ్రెస్, జేడీఎస్‌(కాంగ్రెస్ 76 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకున్నాయి. ముగ్గురు స్వతంత్రంగా గెలిచారు)లు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత మళ్లీ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది.

ఈ సారి కూడా హంగ్ అసెంబ్లీ వస్తుందని పై మూడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం గమనార్హం.