Asianet News TeluguAsianet News Telugu

Karnataka Assembly Election: నాలుగు శాతం ముస్లిం కోటాను రద్దు చేస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Karnataka Assembly Election 2023: శివమొగ్గలో కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ముస్లిం కోటాపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఓబీసీ జాబితాలో ముస్లింలకు 4 శాతం కోటాను రద్దు చేస్తూ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.
 

Karnataka Assembly Election: We will abolish 4 per cent Muslim quota: Union Home Minister Amit Shah RMA
Author
First Published May 2, 2023, 4:56 AM IST

Union Home Minister Amit Shah: క‌ర్నాట‌క రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా.. హాట్ హాట్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. రాష్ట్రంలో మే 10న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం క‌ర్నాట‌క‌లోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ రోడ్ షోలు నిర్వహించారు. తుమకూరు జిల్లాలోని గుబ్బి, తిప్పూరు, హవేరి జిల్లాలోని రాణేబెన్నూరు, శివమొగ్గలో రోడ్ షోల సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ప్రత్యేకంగా రూపొందించిన వాహనంపై నిలబడిన అమిత్ షాకు రోడ్లకు ఇరువైపులా, సమీప భవనాలపై గుమిగూడిన ప్రజలు స్వాగతం పలికారు.

శివమొగ్గలో కేంద్రమంత్రి వెంట బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప, పార్టీ ఎంపీ బీవై రాఘవేంద్ర ఉన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు బీజేపీ జెండాలు పట్టుకుని అమిత్ షా వాహనం వెంట నడుస్తూ బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ నినాదాలు చేస్తూ, 'జై శ్రీరామ్', 'భారత్ మాతాకీ జై' అని నినదించారు. జనం అమిత్ షాపై పూలవర్షం కురిపించగా, ఆయన కూడా చేతులు ఊపుతూ, పూలు విసిరారు. నాలుగు నియోజకవర్గాల్లో రోడ్డు షోల త‌ర్వాత అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలనీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చూడాలని ప్రజలను కోరారు. అలాగే, ఓబీసీ జాబితాలో ముస్లింలకు 4 శాతం కోటాను రద్దు చేస్తూ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కర్ణాటక కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసిందనీ, వొక్కలిగలు, లింగాయత్ లు, ఎస్సీ/ ఎస్టీల కోటాను పెంచిందని తెలిపారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శ‌లు సైతం చేశారు. కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ తిరిగి తీసుకువస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం అన్నారు. “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, వారు ఈ రిజర్వేషన్లన్నింటినీ (పెంపు) వెనక్కి తీసుకుని, మరోసారి ముస్లిం రిజర్వేషన్లను తీసుకువస్తారు. మీకు నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ కావాలా? (తిరిగి రావడానికి)" అంటూ ప్ర‌శ్నించారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మోడీ మరోసారి 2024లో ప్రధాని అవుతారని అమిత్ షా అన్నారు. 

క‌ర్నాట‌క ఎన్నిక‌లు.. బీజేపీ మేనిఫెస్టో విడుద‌ల 

ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా కర్ణాటకలో ఏకీకృత పౌర స్మృతి (యూసీసీ) అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో సహా 16 హామీలను విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచి, బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అధికార బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రతి బీపీఎల్ కుటుంబానికి ప్రతిరోజూ అర లీటర్ నందిని పాలు, నెలవారీ రేషన్ కిట్ల ద్వారా 5 కిలోల శ్రీ అన్న-సిరి ధన్య (చిరుధాన్యాలు) అందించే 'పోషణ' (పోషకాహార) పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. అలాగే అన్ని బీపీఎల్ (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న) కుటుంబాలకు సంవత్సరానికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లను అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

ఎన్నికల రాజకీయాల నుంచి రిటైరైన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, లింగాయత్ దిగ్గజం బీఎస్ యడియూరప్ప సమక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ మేనిఫెస్టో (విజన్ డాక్యుమెంట్) ను విడుదల చేశారు. అంతకుముందు ఏప్రిల్ 29న ఉడిపిలో జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రామమందిరం విషయంలో ఇరుక్కుపోయి, దాన్ని వేలాడదీసి తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే రామ మందిరానికి పునాది వేసిన  విష‌యాన్ని గుర్తు చేశారు. రామ మందిర నిర్మాణ పనులు 2024 నాటికి పూర్తవుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios