Karnataka Assembly Election: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే భారత ప్రధాని నరేంద్రమోదీని విషపు పాము అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజా ఆయన తనయుడు ప్రియాంక్‌ ఖర్గే కూడా ప్రధానిపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఎం జరిగిందంటే..?  

Karnataka Assembly Election: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఎన్నికలకు మరో వారం రోజుల సమయం ఉండడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో.. ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.. వరుసగా రెండోసారి పగ్గాలు చేపట్టాలని అధికార బీజేపీ భావిస్తుంటే.. ఎలాగైనా అధికార పగ్గాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రధాని మోడీపై టార్గెట్ పెట్టింది. ప్రతి నాయకుడు ప్రధానిపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. 

తాజాగా ప్రధానిమోదీపై (PM Modi) కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కుమారుడు ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని నాలాయక్ బేటా అని సంబోధించారు. నాలాయక్ బేటా అంటే ‘విలువ లేనివాడు’, ‘పనికిమాలిన మనిషి’ అని అని అర్థం. ప్రియాంక్ మాజీ మంత్రి. ఆయన ఈసారి కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలిచారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల విషయంలో ప్రధాని, ఆయన పార్టీ గందరగోళం సృష్టించిందని అన్నారు.
కలబురగి జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని బంజారాలకు ఇచ్చిన బరోసా గురించి ప్రస్తావించారు.

కలబురిగి జిల్లా పర్యటనలో ప్రధాని బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ మీరందరూ భయపడకండి. బంజారా సామాజిక వర్గానికి చెందిన ఓ కొడుకు ఢిల్లీలో కూర్చున్నాడు. అందరి బాగోగులు చూస్తాను" అని చెప్పారు.

ఈ వ్యాఖ్యలను కౌంటర్‌గా ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని తనను తాను బంజారా సామాజికవర్గానికి చెందిన కుమారుడిగా చూపించి, రిజర్వేషన్ల గురించి గందరగోళం సృష్టించాడు. బంజారా వర్గానికి అన్యాయం జరగలేదా? షికారిపుర (శివమొగ జిల్లా) యడ్యూరప్ప ఇంటిపై ఎందుకు రాళ్లు రువ్వారు? కల్బుర్గి, జేవర్గిలో బంద్ ఎందుకు చేశారు? నేడు రిజర్వేషన్ విషయంలో గందరగోళం నెలకొందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని బంజారాల కొడుకు కాదని, పనికిరాని కొడుకు (నలాయక్‌ బేటా) అని ప్రియాంక్‌ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాంటి పనికిరాని వ్యక్తి మనకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. ఇంత పనికిమాలిన కొడుకు ఢిల్లీలో కూర్చుంటే మీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తారు? అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి ప్రభుత్వం తన పదవీకాలం ముగిసే సమయానికి.. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను 15 శాతం నుండి 17 శాతానికి పెంచే బిల్లును ఆమోదించింది. ఎస్సీ (లెఫ్ట్) అంతర్గత రిజర్వేషన్లు ఇప్పుడు ఆరు శాతం, ఎస్సీ (రైట్) 5.5 శాతం, ఇతర ఎస్సీలకు 5.5 శాతం అని ప్రభుత్వం తెలిపింది.

ప్రియాంక్ పై బీజేపీ ఆగ్రహం

ప్రియాంక్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లికార్జున ఖర్గేపై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు గతంలో కూడా మోదీని వ్యక్తిగతంగా విమర్శించి దెబ్బ తిన్నారు. అమిత్ మాలవీయ ప్రియాంక్ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీంతో పాటు మల్లికార్జున్ ఖర్గే కొడుకు కాకపోతే ప్రియాంక్ ఖర్గే ఏం చేసి ఉండేవాడు.. తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక్ అసమర్థుడని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిపై వ్యాఖ్యానించడం తగదని ట్విట్ చేశారు.


మల్లికార్జున్ ఖర్గే క్లారిటీ 

ఏప్రిల్ 27న ప్రధాని నరేంద్ర మోదీపై మల్లికార్జున్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్రమోడీ విషసర్పం లాంటి వారని అన్నారు. ప్రజల వైపు చూపిస్తూ విషం రుచి చూస్తే చచ్చిపోతారని అన్నారు. వివాదాస్పద ప్రకటనపై విమర్శలు రావడంతో ఖర్గే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఎవరి పేరు చెప్పలేదు అని చెప్పాడు. ప్రధాని మోదీని ఉద్దేశించి.. ఇలాంటి ప్రకటన చేయలేదని, బీజేపీ సిద్ధాంతం పాములాంటిదని తన ఉద్దేశ్యమని అన్నారు. క్షమాపణలు కూడా చెప్పారు. కర్ణాటకలో ఒకే దశలో ఎన్నికలు జరగడం గమనార్హం. మే 10న ఓటింగ్ నిర్వహించి.. మే 13న ఫలితాలను వెల్లడించనున్నారు.