సారాంశం
Karnataka Assembly election: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని అధికారికంగా ప్రకటించడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కిచ్చా సుదీప్ సినిమా, ఆయన చేస్తున్న షోలు, ప్రకటనల ప్రసారాలను నిలిపివేయాలని జేడీఎస్ తో పాటు పలవురు న్యాయవాదులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆయన ఓటర్లను ప్రభావితం చేసే విషయాలను తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Kannada superstar Kichcha Sudeep: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వివిధ పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు, ప్రత్యారోపణల తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదిలావుంటే, నటుడు కిచ్చా సుదీప్ బీజేపీ నేతల తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు. బసవరాజ్ బొమ్మై తో ఉన్న అనుబంధంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది ఆయనకు మరో దఫా రాజకీయ సమరానికి వేదికైంది. అయితే, ఈ విషయంలో కిచ్చా సుదీప్ కు బెదిరింపులు వచ్చాయి. ఇక తాజాగా ఆయన సినిమాలు, షోలు, ప్రకటనలకు సంబంధించి ఎన్నికల కిమిషన్ కు సైతం ఫిర్యాదులు అందాయి. బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించిన సుదీప్ ప్రకటనలు, సినిమాలు, పోస్టర్లపై నిషేదం విధించాలని కోరుతూ జేడీఎస్ తో పాటు పలువురు న్యాయవాదులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కిచ్చా సుదీప్ ప్రకటనలు, సినిమాల ప్రదర్శనపై ఎలాంటి నిషేధం ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
సీఎం బసవరాజ్ బొమ్మై, కిచ్చా సుదీప్ ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు. కీలక సమయంలో కిచ్చా సుదీప్, సీఎం బసవరాజ్ బొమ్మై చేతులు కలిపారు. "నాకు సహాయం చేసిన వారికి నేను సహాయం చేస్తాను. నేను ఆ వ్యక్తిని (బసవరాజ్ బొమ్మై) గౌరవిస్తాను. ఆ వ్యక్తి తరఫున ప్రచారం చేస్తాను" అంటూ కిచ్చా సుదీప్ ప్రకటించారు. బీజేపీలో చేరడం లేదంటూనే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ఆయన అధికారిక ప్రకటన చేశారు. ఆయన ప్రకటన తర్వాత ఆయనకు బెదిరింపులు సైతం వచ్చాయి. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ఆయన పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ విమర్శలతో విరుచుకుపడ్డాయి.
జేడీఎస్ కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ పై విమర్శల దాడి చేసింది. అలాగే, పలువురు న్యాయవాదులు సైతం ఆయన నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శివమొగ్గకు చెందిన న్యాయవాది శ్రీపాల సుదీప్ కు వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న సుదీప్ తన సినిమాలు, ప్రకటనలు, పోస్టర్లను నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. నటుడు సుదీప్ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కాబట్టి ఎన్నికలు ముగిసే వరకు ఆయన సినిమాలు, ప్రకటనలు, పోస్టర్లు ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ జేడీఎస్ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. సినిమాలు, ప్రకటనలు, పోస్టర్లు వంటివి పెడితే అది ఓటర్లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఎన్నికలు ముగిసే వరకు సుదీప్ ఫోటోతో కూడిన ఏ షో, ప్రకటన లేదా సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ జేడీఎస్ లీగల్ వింగ్ ఫిర్యాదు చేసింది.
అయితే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న నటుడు కిచ్చా సుదీప్ తన సినిమాలు, ప్రకటనల ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. కిచ్చా సుదీప్ సినిమా, ప్రకటనల ప్రదర్శనపై ఎలాంటి ఆంక్షలు లేవని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. దీంతో సుదీప్ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, సీఎం బసవరాజ్ బొమ్మై పోటీ చేసే నియోజకవర్గం, శిగ్గాంవితో పాటు నాయకి కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సుదీప్ ప్రచారం నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.