సారాంశం
Bengaluru: మే 10న జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) లు ప్రజలను తమవైపునకు తిప్పుకోవడానికి ముందున్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సినీ రంగ ప్రముఖులను సైతం ఎన్నికల ప్రచారం కోసం రంగంలోకి దింపాలని చూస్తున్నాయి.
Kannada superstar Yash-Karnataka Assembly Election: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని రాజకీయ పార్టీలన్ని ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) లు ప్రజలను తమవైపునకు తిప్పుకోవడానికి ముందున్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సినీ రంగ ప్రముఖులను సైతం ఎన్నికల ప్రచారం కోసం రంగంలోకి దింపాలని చూస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కన్నడ సూపర్ స్టార్ యష్ ను ఆహ్వానించాయని సమాచారం. అయితే, దీనిని ఆయన తిరస్కరించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ప్రచారంలో పాల్గొనేందుకు కన్నడ సూపర్ స్టార్ యశ్.. పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. యశ్ కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రజాదరణ ఉందనీ, ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా నియమించేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు ఆయనను నిరంతరం సంప్రదిస్తున్నాయి. అయితే యశ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టి రాజకీయ నాయకుల ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నాడు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో యశ్ కొంతమంది అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తో కలిసి మండ్యలో మకాం వేసి చివరి రోజు వరకు ప్రచారం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడిపై స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ ను గెలిపించారు. అయితే, ప్రస్తుతం యశ్ ఒక సినిమాను ఫైనల్ చేస్తున్నాడని, ఈ నెలాఖరులోగా ప్రకటన వెలువడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు యశ్ తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అదేవిధంగా కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కూడా ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నారు.