Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి కన్నుమూత‌

Anand Mamani: కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి (56) కన్నుమూశారు. సౌదత్తి శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన శనివారం రాత్రి మ‌ర‌ణించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 

Karnataka Assembly Deputy Speaker Anand Mamani passed away
Author
First Published Oct 23, 2022, 11:49 AM IST

Karnataka Assembly Deputy Speaker:  భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) శాసనసభ్యుడు, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి క‌న్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో ఓ ప్ర‌యివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు ఆదివారం తెలిపాయి. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 56 సంవ‌త్స‌రాలు. సౌదత్తి శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన శనివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

 

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేతలు  ఆనంద్ మామణి సంతాపం తెలిపారు. "కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి కన్నుమూయడం బాధాకరం. సామాజిక సాధికారత కోసం విస్తృతంగా కృషి చేసిన  నాయకుడు ఆయన. కర్ణాటక అంతటా  బీజేపీని బలోపేతం చేయడానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలంటూ" ప్రధాని ట్వీట్ చేశారు.

 

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రిని సందర్శించి నివాళులర్పించారు. "మా పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ చంద్రశేఖర్ మామణి మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనీ, ఆయన కుటుంబానికి భగవంతుడు ఆ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి" అని బొమ్మై ట్వీట్ చేశారు.

 

ఆనంద్ మామణి తండ్రి చంద్రశేఖర్ ఎం మామణి కూడా 1990లలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 


లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా తన సంతాపాన్ని ప్ర‌క‌టించారు. ఆయ‌న త‌న ట్వీట్  లో “కర్ణాటక శాసనసభ డిప్యూటీ స్పీకర్ & మూడుసార్లు ఎమ్మెల్యే అయిన ఆనంద్ మామ‌ణి జీ అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబాలు & అనుచరులతో ఉన్నాయి. అతని ఆత్మ మహాప్రభువు పాద పద్మములను పొందుగాక. ఓం శాంతి!” అని పేర్కొన్నారు. 

 

డెక్కన్ హెరాల్డ్ ప్రకారం, మామణిని సెప్టెంబర్‌లో అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్‌లో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చికిత్స పొందుతూ.. ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు. 2008లో బీజేపీలో చేరిన మామణి, మార్చి 2020లో అసెంబ్లీకి 24వ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios