Karnataka Accident : వినాయక నిమజ్జన ఊరేగింపులోకి లారీ దూసుకెళ్లిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 8 మంది చనిపోగా 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Karnataka Accident : కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. హసన్ జిల్లాలోని హొలెనరసిపుర తాలూకా మొసలే హొసహళ్లిలో శుక్రవారం వినాయక నిమజ్జన ఊరేగింపులో విషాదం చోటుచేటుకుంది. నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నవారిపైకి అమాంతం ఓ లారీ దూసుకెళ్లింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఆ లారీ జనాలను ఢీకొంటూ ముందుకు వెళ్లింది.. ఈ ఘటనలో 8 మంది మరణించగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో హసన్ పట్టణం విషాదంలో మునిగిపోయింది.

అదుపుతప్పిన లారీ

ఈ ప్రమాదం వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా జరిగింది… హసన్ నుండి హొలెనరసిపుర వైపు వేగంగా వెళుతున్న లారీ సరిగ్గా ఊరేగింపు ప్రాంతానికి రాగానే అదుపుతప్పింది. అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి నిమజ్జనంలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న జనాలపైకి దూసుకెళ్ళింది. బైక్ ను ఢీకొట్టకుండా ఉండేందుకు ప్రయత్నించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Scroll to load tweet…

ఈ ప్రమాదంలో 5 గురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 20 మందికి పైగా గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉంది.. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో లారీ మితిమీరిన వేగంతో ఉండటం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు జరక్కుండా జనాలు ఎక్కువగా పాల్గొనే ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్‌పై తగిన ఆంక్షలు విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల నిర్లక్ష్యమే కారణమా? 

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ సంఘటనా స్థలాన్ని సందర్శించారు… గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో సహాయం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ… పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. వినాయక ఊరేగింపు మార్గంలో ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించాల్సిందన్నారు. అసలు ఊరేగింపు సమయంలో పోలీసులు లేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అమాయక ప్రజల ప్రాణాలుతీసిన ఈ యాక్సిడెంట్ ను ఎస్పీ సీరియస్ గా తీసుకోవాలని… నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా? 

ప్రభుత్వం ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఎమ్మెల్యే రేవణ్ణ డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, అతని తప్పు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారని అన్నారు. అమాయక ప్రజలు ప్రాణాలను బలితీసుకున్న లారీ డ్రైవర్, యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే రేవణ్ణ అన్నారు.

బాధితులకు కేంద్రం ఆర్థికసాయం

హసన్ లో వినాయక నిమజ్జన ఊరేగింపులో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు... బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని. గాయపడినవారికి రూ.50,000 ప్రకటించారు.

Scroll to load tweet…