రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు అధికారాలను ఉపయోగించుకునేందుకు చట్టాలను మార్చుతున్నారని రాజ్యసభ ఎంపీ సిబల్ విమర్శించారు. ప్రత్యర్థుల నోరు మూయించే బీజేపీ ఎజెండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఇండియన్ జస్టిస్ కోడ్ బిల్లు-2023, ఇండియన్ సెక్యూరిటీ బిల్లు-2023, ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ బిల్లులపై ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ బిల్లు-2023 వలసరాజ్యాల కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసం క్రూరమైన పోలీసు అధికారాలను ఉపయోగించడాన్ని అనుమతిస్తుందని మాజీ న్యాయ మంత్రి కపిల్ సిబల్ ఆరోపించారు. ప్రత్యర్థుల నోరు మూయించడానికే కేంద్రం ఇలాంటి చట్టాలు తీసుకవచ్చిందని, ప్రతి పక్షాలను అణివేయడమే బీజేపీ ఎజెండా అని ఆయన అన్నారు. 

ఈ క్రమంలో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఒక ట్వీట్‌లో " రాజకీయ ప్రయోజనాల కోసం క్రూరమైన పోలీసు అధికారాలను ఉపయోగించుకునేందుకు భారతీయ న్యాయ సంహిత(BNS)- 2023 అనుమతిస్తుంది. భారతీయ న్యాయ సంహిత బిల్లు అమల్లోకి వస్తే.. 15 నుండి 60 లేదా 90 రోజుల వరకు పోలీసు కస్టడీని అనుమతిస్తుంది. రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులపై విచారణకు కొత్త నేరాలు (పునర్నిర్వచించబడ్డాయి). ప్రత్యర్థుల నోరు మూయించడమే కేంద్ర ప్రభుత్వం ఎజెండా." అని పేర్కొన్నారు.

వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛను తొలగించారు: మనీష్ తివారీ

ఈ బిల్లులో వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛను తొలగించారని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. అందువల్ల వీటన్నింటిపై విచారణ జరిపేందుకు అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ చట్టపరమైన వ్యక్తులతో కూడిన పార్లమెంటు సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌లకు మనవి చేశారు. 

క్రిమినల్ చట్టాల పునర్విమర్శలో భాగంగా ఐపిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), ఇండియన్ ఎవిడెన్స్ చట్టాల స్థానంలో మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వీటితో పాటు దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసి.. దానిని విస్తృత నిర్వచనం ఇవ్వాలని, కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. 

ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS) బిల్లు 2023, CrPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) బిల్లు 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య (BS) బిల్లు 2023 ని ప్రవేశపెట్టారు. 

BNS బిల్లులో పరువు నష్టం, ఆత్మహత్యాయత్నంతో సహా ఇప్పటికే ఉన్న నిబంధనలకు అనేక మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నామనీ, మహిళలపై నేరాలకు పాల్పడితే..శిక్షలను కఠినతరం చేశాయని, సత్వర న్యాయం అందించేందుకు ఈ మార్పులు చేశామని షా తెలిపారు.