కాన్పూర్: మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్ లోని వాహనం ప్రమాదానికి గురైంది. కాన్పూర్ లో వాహనం బోల్తా పడింది. వాహనం డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో వికాస్ దూబే పారిపోవడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. 8 మంది పోలీసులను హత్య చేసిన ఘటనలో దూబే ప్రధాన నిందితుడు.

వికాస్ దూబేను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టు చేసి ప్రత్యేక కాన్వాయ్ లో కాన్పూర్ తరలిస్తుండగా అందులోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. కాన్పూర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బోల్తా పడిన వాహనంలోనే వికాస్ దూబే ఉన్నట్లు తెలుస్తోంది. బోల్తా పడిన వాహనంలోంచి బయటపడి దూబే పారిపోవడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. ఈ సమయంలో జరిగిన ఎన్ కౌంటర్ లో దూబే మరణించినట్లు చెబుతున్నారు.

తనను అరెస్టు చేసిన వెంటనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే పెద్దగా అరిచాడు. మై వికాస్ దూబ్ హూ, కాన్పూర్ వాలా (నేను వికాస్ దూబేను, కాన్పూర్ కు చెందినవాడిని) అని తనను అరెస్టు చేసిన వెంటనే పెద్దగా అరిచాడు. దాంతో పోలీసు అధికారి అతని తల వెనక బాది అరవకు అని హెచ్చరించాడు. 

అయితే, మహంకాళి ఆలయం వద్ద పథకం ప్రకారం అతను పోలీసులకు లొంగిపోవడానికి ఏర్పాటు చేసుకున్నట్లున్నాడని యూపి డీజీపీ అరవింద్ కుమార్ అన్నారు. తనను తాను మహంకాళి సెక్యూరిటీ గార్డుకు పరిచయం చేసుకున్నాడని, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడని ఆయన చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ పోలీసులు తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని గ్రహించడంతో, తన అనుచరులు ముగ్గురు పోలీసులు కాల్పుల్లో హతం కావడంతో భయపడి వికాస్ దూబే మధ్యప్రదేశ్ లో పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. కొంత మంది పోలీసులతో, రాజకీయ నేతలతో వికాస్ దూబేకు పరిచయాలున్నాయి. 

వికాస్ దూబే అరెస్టును మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ధ్రువీకరించారు. కాన్పూర్ ఎన్ కౌంటర్ తర్వాత తమ పోలీసులు అప్రమత్తయ్యారని, వికాస్ దూబేను పట్టుకోవడానికి అది సాయపడిందని ఆయన అన్నారు. ఇద్దరు వికాస్ దూబే అనుచరులను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ లోని తన నివాసం వద్ద ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే వారం రోజుల తర్వాత పోలీసుల చేతికి చిక్కాడు. మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో అతను పోలీసులకు చిక్కాడు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వికాస్ దూబే పూజలు చేయడానికి వచ్చాడు. మహంకాళి ఆలయం వద్ద సెక్యూరిటీ గార్డు వికాస్ దూబేను పట్టుకున్నాడు. ఆ విషయాన్ని సెక్యూరిటీ గార్డు ఉజ్జయిని ఎస్పీ మనోజ్ సింగ్ కు చెప్పాడు. దాంతో ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను తమ కస్టడీలోకి తీసుకున్నారు. 

వికాస్ దూబేను అదుపులోకి తీసుకున్న విషయాన్ని మధ్యప్రదేశ్ డీజీపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు చెప్పారు. శివరాజ్ సింగ్ చౌహన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. 

వికాస్ దూబేను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వికాస్ దూబే ముఖ్య అనుచరులు ముగ్గురు హతమయ్యారు. గురువారం ఉదయం ఇద్దరు హతం కాగా, అంతకు ముందు ఒకతను మరణించాడు.