సుగంధ ద్రవ్యాల వ్యాపారి, పర్ఫ్యూమ్ బేరన్ పియూష్ జైన్ పెద్ద మొత్తంలో పన్ను చెల్లించడానికి సిద్ధం అయ్యారు. పన్నులు చెల్లించకుండా అక్రమంగా దాచిపెట్టుకున్న నగదు, బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి తాను చెల్లించాల్సిన న్యాయబద్ధమైన పన్ను చెల్లిస్తానని పియూష్ పేర్కొన్నట్టు దర్యాప్తు ఏజెన్సీవర్గాలు తెలిపాయి. ఈ మొత్తం సుమారు రూ. 187 కోట్లు ఉండొచ్చని వివరించాయి. 

న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో పన్ను చెల్లించకుండా నగదు, బంగారాన్ని దాచిపెట్టుకుని దొరికిపోయిన సుగంధ ద్రవ్యాల వ్యాపారి పియూష్ జైన్ చివరకు తాను పన్ను చెల్లించడానికి సిద్ధం అని తెలిపారు. పన్ను ఎగవేతలపై ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ ఏజెన్సీలు పియూష్ జైన్‌ను విచారిస్తున్నాయి. ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తాను చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని చెల్లిస్తానని అంగీకరించినట్టు దర్యాప్తు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. జైలులో పియూష్ జైన్‌ను విచారిస్తున్న సందర్భంలోనే ఆయన తాను చెల్లించాల్సిన పన్నును చెల్లిస్తానని అంగీకరించినట్టు వివరించాయి.

పియూష్ జైన్‌కు సంబంధించిన ప్రాంతాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తంపై 87 శాతాన్ని పన్నును ఐటీ ఫిక్స్ చేసింది. అంటే.. ఆయన సుమారు 187 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

పన్నుల ఏజెన్సీ పియూష్ జైన్ సంబంధించిన ప్రాంతాల నుంచి తనిఖీల్లో రూ. 197 కోట్ల నగదు, 23 కిలోల బంగారం, 600 కిలోల ఎర్రచందనం నూనెను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఫండ్స్.. కాన్పూర్, కన్నౌజ్ బ్యాంకులో ఫిక్స్‌‌డ్ డిపాజిట్లు చేశారు.

కాన్పూర్‌కు చెందిన ఈ బిజినెస్ మ్యాన్ ఇప్పటికే 54 కోట్లు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీజీఐ) అహ్మదాబాద్ యూనిట్‌లో జమ చేశారు. ఆయన స్వయంగా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. అయితే, డీజీజీఐ పియూష్ జైన్‌పై విధించాల్సిన పెనాల్టీని ఇంకా గణించలేదు. అయితే, ఈ పెనాల్టీ కూడా సుమారు రూ. 60 కోట్ల వరకు ఉండొచ్చని ఏజెన్సీ వర్గాలు అంచనా వేశాయి. 

పియూష్ జైన్ తన నివాసంలో లభించిన బంగారానికి ఇంపోర్ట్ డ్యూటీ కింద రూ. 4 కోట్లు చెల్లించారు. కానీ, అక్రమంగా ఆ గోల్డ్‌ను స్మగుల్ చేసినందుకు ఇంకా పెనాల్టీ చెల్లించాల్సి ఉన్నది. అంటే ఇప్పటి వరకు పియూష్ జైన్ రూ. 58 కోట్ల పన్ను, డ్యూటీ చెల్లించారు. అలాగే, ఇప్పుడు రూ. 187 కోట్లను చెల్లించడానికి సంసిద్ధత ప్రకటించారు. మొత్తం గణిస్తే.. ఆయన చెల్లించాల్సిన మొత్తాలు రూ. 250 కోట్లను మించి పోయేలా ఉన్నట్టు తెలిసింది.