ప్రముఖ కన్నడ  సాహితీవేత్త, ఉద్యమకారుడు చంద్రశేఖర్ పాటిల్ (83) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు బెంగళూరులో నిర్వ‌హించ‌నున్న‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ప్రముఖ కన్నడ (kannada) సాహితీవేత్త, ఉద్యమకారుడు చంద్రశేఖర్ పాటిల్ (chandra shekar patil) (83) అనారోగ్యంతో మృతి చెందారు. వృధ్యాపం వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో కొంత కాలంగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న సోమవారం మృతి చెందారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు బెంగళూరు (Bangalore) లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. పాటిల్ హవేరీ జిల్లాలోని హత్తిమత్తూరు గ్రామంలో జ‌న్మించారు. ఆయ‌న‌కు భార్య ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. 

‘చంపా’ (champa) గా ప్రసిద్ధి చెందిన చంద్రశేఖర్ పాటిల్ క‌న్న‌డ‌లో ప్రసిద్ధ కవి, నాటక రచయిత, ‘బండయా’ (bandaya) ఉద్యమం (ప్రగతిశీల, తిరుగుబాటు సాహిత్య ఉద్యమం) లో ప్రముఖ పాత్ర పోషించారు. చంద్ర‌శేఖ‌ర్ పాటిల్ ప్రభావవంతమైన సాహిత్య పత్రిక ‘సంక్రమణ’కి ఎడిట‌ర్ (editor)గా ప‌ని చేశారు. చారిత్రాత్మక గోకాక్ ఆందోళన, బండ‌యా ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. మండల్ నివేదిక అమలు కోసం కృషి చేశారు. అలాగే రైతు ఉద్యమంతో పాటు అనేక సామాజిక‌, సాహిత్య ఉద్యమాలకు నాయకత్వం వ‌హించారు. 

ధార్వాడ్‌లోని కర్నాటక్ యూనివ‌ర్సిటీ (karnatak univercity) నుంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా రిటైర్డ్ అయిన త‌రువాత కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడిగా, కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా చంద్రశేఖర్ పాటిల్ పనిచేశారు. ప్రొఫెసర్ ఎం.ఎం కల్బుర్గి హత్యను నిరసిస్తూ కర్నాటక ప్రభుత్వం ఆయ‌న‌కు అందించిన అత్యున్నత సాహిత్య పురస్కారమైన పంపా అవార్డును తిరిగి ఇచ్చేశారు. 

పాటిల్ మృతికి క‌ర్నాట‌క సీఎం బసవరాజ్ బొమ్మై (cm basavaraj bommai) సంతాపం తెలిపారు. ‘‘ పాటిల్ గొప్ప విప్లవ సాహితీవేత్త. కన్నడ సాహిత్యానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. దేశ భాషా ఔన్నత్యం కోసం ఆయన ఎంతో పోరాడారు’’ అని ఆయ‌న పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయ‌కుడు సిద్ధరామయ్య (sidda ramaiah) కూడా చంద్రశేఖర్ పాటిల్ మృతి ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న మ‌ర‌ణం కన్నడ సాహిత్య ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు.