Asianet News TeluguAsianet News Telugu

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ.. టుక్డే టుక్డే గ్యాంగ్‌తో జట్టు అంటు బీజేపీ విమర్శ

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్హయ్య కుమార్, గుజరాత్‌లోని వడ్గాం నియోజకవర్గ ఎమ్మెల్యే, జేఎన్‌యూ మాజీ విద్యార్థి జిగ్నేశ్ మేవానీలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీసులో రాహుల్ గాంధీ, హార్దిక్ పటేల్ సమక్షంలో వీరిరువురు కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కార్యాలయం ఎదురుగా వారికి స్వాగతం పలుకుతున్న కటౌట్లు వెలిశాయి.

kanhaiya kumar, jignesh mewani to join congress today
Author
New Delhi, First Published Sep 28, 2021, 4:25 PM IST

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థులు కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీలు నేడు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ గాంధీ, హార్దిక్ పటేల్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ కార్యలయం  ఎదుట వారిరువురికి స్వాగతం తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇటీవలే గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను, కన్హయ్య కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరనున్నట్టు వెల్లడించారు.

భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ నెల 27వ తేదీనే వీరు కాంగ్రెస్‌లోకి చేరనున్నట్టు వీరు ప్లాన్ చేసుకున్నారు. కానీ, అదే రోజున రైతులు భారత్ బంద్ పిలుపునివ్వడంతో తేదీని మార్చుకున్నారు. ఒక రోజు వాయిదా వేసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిపారు. గతనెలలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కన్హయ్య కుమార్ కలవడంతో ఆయన పార్టీలో చేరనున్నారన్న వార్తలు వచ్చాయి. అనంతరం, జిగ్నేశ్ మేవానీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

జేఎన్‌యూలో వీరిరువురి నిరసనలు కొన్ని వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కన్హయ్య కుమార్‌ను పార్టీలోకి తీసుకోవడంపై పార్టీవర్గాల్లో కొంత అసమ్మతి ఉన్నది. వారితో పార్టీకి ఒరిగేదేమీ లేదని, అంతేకాదు, వారి చరిత్రతో పార్టీకే నష్టం జరగవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో లెఫ్టిస్ట్ నేతలు పెరిగిపోతున్నారన్న వాదనలూ వస్తున్నాయి. పార్టీ మధ్యేవాద సిద్ధాంతాన్ని మరోసారి పున:సమీక్షించుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నది.

కాగా, వీరి చేరికపై వచ్చిన వార్తలపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ టుక్డే టుక్డే గ్యాంగ్‌తో చేతులు కలుపుతున్నదని విమర్శించింది. సర్జికల్ స్ట్రైక్ వార్షికోత్సవం రోజునే వీరిరువురిని కాంగ్రెస్ ఆహ్వానిస్తున్నదని అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు.

కన్హయ్య కుమార్ సీపీఐ పార్టీ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లోని బెగుసరాయ్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios