Asianet News TeluguAsianet News Telugu

మరో వివాదంలో కంగనా.. ఎఫ్ఐఆర్‌ దాఖలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ పిక్‌తో ‘నా మూడ్’ ఇలా ఉందంటూ పోస్టు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆందోళనలు చేస్తున్న రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి మరో వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. సిక్కులను కించపరిచేలా 1984లో జరిగిన బ్లూస్టార్ ఆపరేషన్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో ఆమెపై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్‌లపైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె రియాక్షన్ చర్చనీయాంశమైంది. ఓ బోల్డ్ పిక్ షేర్ చేస్తూ ఎఫ్ఐఆర్‌ల గురించి రాసుకొచ్చారు.
 

kangana shares bold pic on filing another FIR against her
Author
Mumbai, First Published Nov 24, 2021, 2:15 PM IST

ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. వరుసగా ఎఫ్ఐఆర్‌లు ఆమె మీద దాఖలు అవుతున్నాయి. పద్మ శ్రీ అవార్డు అందుకున్న తర్వాతి రోజు ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత స్వాతంత్ర్యంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మొదలు.. ఆందోళనలు చేస్తున్న రైతుల వరకు ఆమె నోరు పారేసుకున్నారు. తాజాగా, వరుసగా తనపై నమోదవుతున్న ఎఫ్ఐఆర్‌లపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బోల్డ్పోస్టు పెట్టారు.

1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం రాలేదని, అది కేవలం ఒక భిక్ష అని, అసలైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందని కేంద్రంలోని బీజేపీని పరోక్షంగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచారని మండిపడ్డారు. ఆమెకు ఇచ్చిన పద్మ శ్రీ అవార్డు వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అంతేకాదు, ఈ వ్యాఖ్యలు చేసినందుకు దేశద్రోహం అభియోగాల కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఎపిసోడ్ తర్వాత ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి మరో వివాదాన్ని కొనితెచ్చుకున్నారు.

సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆమె వివాదాస్పద పోస్టు పెట్టారు. ‘ఖలిస్తానీ ఉగ్రవాదులు ఇప్పుడు ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టారేమో కానీ, ఆ మహిళను మనమంతా మరిచిపోరాదు. ఏకైక మహిళా ప్రధాని వారిని తొక్కేసింది. ఆమె ఈ దేశానికి ఎన్ని ఇబ్బందులు తెచ్చిందో పక్కన పెడితే ఆమె వారిని ఈగల్లాగే నలిపేసింది. కానీ, అందుకు మూల్యంగా చివరకు ప్రాణాలు కోల్పోయింది. కానీ, దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడగలిగింది. ఇప్పటికీ కొన్ని దశాబ్దాలు గడిచినా.. ఆమె పేరు వినిపిస్తే వారు ఇప్పటికీ వణికిపోతారు. వారికి అలాంటి గురువే కావాలి’ అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. ఆమె పరోక్షంగా ఆపరేషన్ బ్లూ స్టార్‌ను అందుకు ఆదేశాలు ఇచ్చిన ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీని పేర్కొన్నారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం దగ్గర 1984లో జరిగిన బ్లూ స్టార్ ఆపరేషన్ గురించి ఆమె పరోక్షంగా ప్రస్తావించినట్టయింది.

ఈ వ్యాఖ్యలపై సిక్కులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ముంబయిలోని ఖార్ పోలీసు స్టేషన్‌లో కంగనా రనౌత్‌పై ఫిర్యాదు చేసింది. తమ భావోద్వేగాలను గాయపరుస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఖార్ పోలీసు స్టేషన్‌లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అమర్‌జీత్ సింగ్ సంధూ ఆమెపై ఫిర్యాదు చేశారు.

ఈ ఎఫ్ఐఆర్‌లపై బాలీవుడ నటి కంగనా రనౌత్ స్పందన కూడా ఇప్పుడు చర్చనీయాంశమే అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బోల్డ్ పిక్ షేర్ చేసింది. మరో రోజు.. మరో ఎఫ్ఐఆర్ అంటూ ఆ పిక్‌పై పేర్కొన్నారు. అంతేకాదు, ఒకవేళ వారు తనను అరెస్టు చేయడానికి వస్తే ఇంటి దగ్గర మూడ్ ఇలా ఉంది అంటూ బ్లాక్ డ్రెస్‌లో ఆమె బోల్డ్ పిక్‌ను పోస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios